సూర్యాపేటలో సంచలనం రేపిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గుర్రం శశిధర్ రెడ్డి హత్యకేసును పోలీసులు ఛేదించారు. భూ వివాదాల కారణంగానే నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన ఉప్పల శ్రీనివాస్ అనే స్థిరాస్తి వ్యాపారి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు నిర్ధారించారు. ప్రత్యర్థి ఆచూకీని పసిగట్టేందుకు జీపీఎస్ వంటి అధునాతన పద్ధతులను ఉపయోగించి మరీ అంతమొందించినట్టు వెల్లడైంది. ఈ కేసులో 13 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి భార్య భవానీ ఫిర్యాదుతో ఈ నెల 2న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. గతంలో శశిధర్ రెడ్డి హత్య చేసిన మొదటి భార్య బంధువులే చంపారని అందరూ భావించారు కానీ... భూ తగాదాలతోనే ప్రాణాలు తీసినట్టు సూర్యాపేట డీఎస్పీ మోహన్ కుమార్ వెల్లడించారు.
సూర్యాపేటకు చెందిన గుర్రం శశిధర్ రెడ్డి, నకిరేకల్‌కు చెందిన ఉప్పల శ్రీనివాసులు అలియాస్ ఆయిల్ శ్రీనుకు... కుడకుడ శివారులో కోట్ల విలువ చేసే భూములున్నాయి. ఉప్పల శ్రీనువాసులు రెండో భార్య పద్మశ్రీ పేరు మీద 7 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. కొంతకాలం తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న శశిధర్ రెడ్డి... వివాదాస్పద భూమిని తక్కువ ధరకు పద్మశ్రీ నుంచి కొనుగోలు చేశాడు. దీంతో శ్రీనువాసులు, శశిధర్ రెడ్డిపై కక్ష పెంచుకున్నాడు. అంతే కాకుండా తన భూమిని కూడా ఆక్రమించుకొని బెదిరింపులకు పాల్పడుతున్నాడని... పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ కూడా పెట్టారు. కానీ కొలిక్కి రాలేదు.