Mother and Son Suicide Case: కామారెడ్డిలో ఆత్మాహుతి చేసుకున్న తల్లీకుమారుడి కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కామారెడ్డి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం నిందితులను నిజామాబాద్ జిల్లా జైలుకు తరలించారు. మంగళవారం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు... కోర్టులో హాజరు పరిచే ముందు ఆస్పత్రిలో కొవిడ్ పరీక్షతో పాటు ఇతర వైద్య పరీక్షలు చేయించారు. ఏ7 గా ఉన్న సీఐ నాగార్జున గౌడ్ మినహా ఆరుగురు నిందితులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ ఛైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ యాదగిరి, అతని కుమారుడు స్వరాజ్, సీఐ నాగార్జున గౌడ్ కీలకంగా ఉన్నారు.
నిప్పంటించుకుని ఆత్మహత్య: ఈ నెల 16న కామారెడ్డిలోని లాడ్జిలో నిప్పంటించుకుని రామాయంపేటకు చెందిన తల్లీకుమారుడు పద్మ, సంతోష్‌లు ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో, ఆడియో, సూసైడ్ లేఖ రాశారు. వీటి ఆధారంగా ఏడుగురిపై కేసు నమోదు చేశారు. కేసు విచారణ బాధ్యతలు బాన్సువాడ డీఎస్పీ జైపాల్ రెడ్డికి అప్పగించారు. ఇప్పటికే మృతుల కుంటుంబీకుల నుంచి వివరాలు, ఆధారాలు సేకరించారు.