Fake Raids in Gachibowli: ''ఓ సినిమాలో హీరో.. తన గ్యాంగ్‌తో కలిసి ఐటీ అధికారులమని చెప్పి అవినీతిపరుల ఇళ్లపై నకిలీ రైడ్స్ చేస్తారు. అలా వెళ్లిన ముఠా.. వివరాలు సేకరిస్తున్నట్లు నటించి ఇంట్లోని నగదును కాజేస్తారు. ఎలాగు అక్రమంగా సంపాదించారు కాబట్టి బాధితులు పోలీసులు కూడా ఆశ్రయించలేక చింతిస్తారు''. ఇలాంటి ఘటనలు నిజ జీవితంలో చాలా అరుదుగా చూస్తుంటాం. ఇదే తరహాలో ఓ గ్యాంగ్ సీబీఐ అధికారులమని ఓ ఇంట్లోకి ప్రవేశించి.. నగదు తీసుకుని పరారైపోయింది. కాకపోతే ఇక్కడ బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయట పడింది. సీబీఐ అధికారులమంటూ ఓ ఇంట్లోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు.. బంగారం, డబ్బుతో పరారైన ఘటన గచ్చిబౌలి పీఎస్ పరిధిలో జరిగింది.
సినీ ఫక్కీలో చోరీ
Fake CBI Raids In Orange county: గచ్చిబౌలిలో జయభేరి ఆరెంజ్ కౌంటిలోని సి-బ్లాక్‌లో సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అపార్టుమెంట్‌లోకి సీబీఐ అధికారులమంటూ ప్రవేశించిన ఆగంతుకులు... ఇంట్లోని కిలోకుపైగా బంగారం, రూ.50 వేల నగదు దోచుకెళ్లారు. అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించగా... అసలు విషయం బయటపడింది.
అరగంటలో సొమ్ముతో పరార్
సీబీఐ అధికారులమంటూ లోనికి ప్రవేశించిన ఆగుంతుకులు... ఇళ్లంతా తిరిగి సోదాలు చేశారని బాధితులు తెలిపారు. అరగంటలో బంగారం, నగదు తీసుకొని ఉడాయించారని వాపోయారు.. అయితే సీబీఐ అధికారుల పేరిట ఇంటిని ఉడ్చేసింది నకిలీ అధికారులని తెలుసుకున్న బాధితులు ఉలిక్కిపడ్డారు.
తనిఖీలు చేయాలని చెప్పి..
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే గచ్చిబౌలిలోని జయభేరి ఆరెంజ్ కౌంటీ అపార్ట్‌మెంట్ ప్రవేశద్వారం వద్ద... భద్రత సిబ్బందికి తాము సీబీఐ అధికారులమని చెప్పిన అయిదుగురు ఆగంతకులు లోనికి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. అపార్టుమెంట్‌లోని సి-బ్లాక్‌లో 110 నంబర్ ఫ్లాట్‌లో నివసించే భువన తేజ ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ యజమాని సుబ్రమణ్యం, భాగ్యలక్ష్మి దంపతుల ఇంట్లోకి ప్రవేశించి... తనిఖీలు చేశారని చెప్పారు.