తెలంగాణ

telangana

ETV Bharat / crime

హీరో మహేశ్​బాబులా పోలీసుల నుంచి తప్పించుకోవాలనుకున్నాడు.. కానీ.. - accused done stunt as hero mahesh babu

అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసుల నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. హీరో మహేశ్​బాబులా.. ఐదతంస్తుల బిల్డింగ్​పై నుంచి కిందికి దూకాడు. పోలీసుల నుంచైతే తప్పించుకున్నాడు. కానీ.. మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయాడు. ఈ ఘటన హైదరాబాద్​ ఆసిఫ్​నగర్​లో చోటుచేసుకుంది.

accused dead by falling from building In order to escape from police in asifnagar
accused dead by falling from building In order to escape from police in asifnagar

By

Published : Oct 12, 2021, 8:43 PM IST

అతడు సినిమాలో పోలీసులను తప్పించుకునేందుకు హీరో మహేశ్​బాబు.. ఓ ఎత్తైన భవనంపై నుంచి దూకి తప్పించుకుంటాడు. ఈ సన్నివేశంలో హీరో మహేశ్​బాబు ఓ తాడు సాయంతో దూరంగా ఉన్న ట్రైన్​ మీదికి దూకుతాడు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రాణాలతో బయటపడతాడు. అచ్చం అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్​లో జరిగింది. కానీ.. ఇక్కడ మాత్రం మహేశ్​బాబులా బతికి బయటపడలేకపోయాడు. ఐదంతస్తుల బిల్డింగ్​పై నుంచి దూకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసుల నుంచి తప్పించుకునేందుకు భవనం మీది నుంచి దూకి ఓ నిందితుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్​లో ఆసిఫ్​నగర్​లో చోటుచేసుకుంది. ఆసిఫ్​నగర్​కు చెందిన కలీముద్దీన్ దుండిగల్​కి చెందిన ఓ మహిళను దుబాయ్​కి పంపిస్తానని నమ్మించాడు. ఆ మహిళ నుంచి లక్షా 30 వేలు వసూలు చేశాడు. తీరా డబ్బులు చేతికందాక.. ముఖం చాటేశాడు.

డబ్బులు తీసుకుని స్పందించకపోవడం వల్ల బాధిత మహిళ దుండిగల్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. కలీముద్దీన్​ను విచారణకు హాజరు కావాలని సూచించారు. విచారణకు రాకపోవటం వల్ల నిందితున్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆసిఫ్​నగర్​లోని అతడి ఇంటికి వెళ్లారు. పోలీసులను చూసిన కలీముద్దీన్.. ఎలాగైనా తప్పించుకోవాలని కంగారు పడ్డాడు. ఈ క్రమంలో ఐదో అంతస్తు నుంచి కిందికి దూకాడు.

తీవ్రంగా గాయపడిన కలీముద్దీన్​ను కుటుంబసభ్యులు హుటాహుటినా.. మహావీర్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆసిఫ్​నగర్ ఇన్స్​పెక్టర్​ రవీందర్ తెలిపారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details