మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బాలిక అపహరణ(girl kidnap case), లైంగిక దాడి(Sexual harassment) కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కీసర మండలం బండ్లగూడలో నివాసం ఉంటున్న అభిరామ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒడిశాలోని భద్రక్ జిల్లాకు చెందిన అభిరామ్ బతుకుదెరువు కోసం 12ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. గొడవల కారణంగా 8 ఏళ్ల క్రితం అతని భార్య విడిపోయింది. అప్పటి నుంచి మేస్త్రీ పని చేసుకుంటూ, చెడు వ్యసనాలకు అలవాటు పడిన అభిరామ్... శారీరక వాంఛ తీర్చుకోవడానికి అడ్డదారులు తొక్కినట్లు పోలీసులు గుర్తించారు.
వారం వ్యవధిలో మరోసారి...
ఈ నెల 4న బాలికను అపహరించుకుపోయిన కిరాతకుడు.. అత్యాచారం చేసి 5న సమీపంలోని గుడిసెల వద్ద వదిలేశాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలిక ఒంటిపై గాయాలుండటాన్ని గమనించిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. బాలికకు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా వారం వ్యవధిలోనే మరో బాలికను అపహరించేందుకు యత్నించాడు అభిరామ్. ఈ నెల 9న మధ్యాహ్నం మరో చిన్నారిని అపహరించేందుకు ప్రయత్నించగా... బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు.