తనిఖీలు చేయకుండా ఉండాలంటే తనకు లంచం ఇవ్వాలంటూ ఎరువులు, పురుగుమందుల దుకాణదారులతో బేరసారాలకు దిగిన మండల వ్యవసాయాధికారి అనిశాకు పట్టుబడ్డాడు. అనిశా డీఎస్పీ ఎస్వీ రమణమూర్తి ఆ వివరాలు వెల్లడించారు. ఏ నెలలో ఎవరు? ఎంతెంత? లంచాలు ఇవ్వాలో సమాచారం ఇచ్చేందుకు సదరు అధికారి ఏకంగా వాట్సప్ గ్రూప్ ఏర్పాటుచేసినట్టు తెలుసుకున్న అనిశా అధికారులు(ACB OFFICERS) నోరెళ్లబెట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో నార్లపాటి మహేష్‌చందర్ ఛటర్జీ ఎనిమిదేళ్లుగా మండల వ్యవసాయాధికారి(A.O)గా పనిచేస్తున్నారు. తనిఖీలు చేయకుండా ఉండేందుకు నెలవారీగా ఇచ్చే లంచం సొమ్ము ఇవ్వాలంటూ మండలంలోని పురుగుమందులు, ఎరువుల యజమానులను డిమాండ్ చేశారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూపులో ఈ నెలలో దుకాణానికి రూ.15 వేలు ఇవ్వాలంటూ సందేశాలు పంపాడు. ఈ విషయమై చంద్రుగొండలోని ఆరు దుకాణాల యజమానులు మచ్చా కుమార్, గోదా సత్యం, ఎర్రం సీతారాములు, ముకేశ్, వెంకట్రామయ్య, చందర్‌రావు జులై 30న అనిశాకు ఫిర్యాదు చేశారు.
పక్కా ప్లాన్‌తో పట్టివేత
పథకం ప్రకారం..ఆరు దుకాణాల నుంచి నగదు సేకరించిన వారు ఆ సొమ్ము తీసుకోవడానికి రావాలంటూ ఏవోను కోరారు. ఈ మేరకు చంద్రుగొండ రైతు వేదికలో సోమవారం సత్యం, సీతారాములు నుంచి ఏవో రూ.90 వేలు తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. అదే సమయంలో అశ్వారావుపేటలోని ఆయన స్వగృహంలో ఏసీబీ సీఐ రఘుబాబు సోదాలు చేశారు. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని, చట్టప్రకారం అధికారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని అనిశా డీఎస్పీ వెల్లడించారు.
సొంత వ్యాపారమే చేటు తెచ్చిందా?
ఎనిమిదేళ్లుగా చంద్రుగొండ మండలంలో పనిచేస్తున్న ఆయన ఇటీవల మండల కేంద్రంలో ఎరువులు, పురుగుమందుల దుకాణం ఏర్పాటుచేసినట్టు సమాచారం. నేరుగా వ్యాపారం చేస్తే ఇబ్బందులొస్తాయనే ఉద్దేశంతో మరో ఇద్దరితో కలిసి వ్యాపారం సాగిస్తున్నట్టు, ప్రభుత్వం రాయితీపై ఇచ్చే అన్ని రకాల వస్తువులను అక్కడ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్టు తెలిసింది. మిగిలిన వ్యాపారులకు ఇది కంటగింపుగా మారింది. అదే ఏవోను అనిశా వలలో చిక్కుకొనేలా చేసిందనే ప్రచారం జరుగుతోంది.
ఇదీ చదవండి:FIRE ACCIDENT: బ్యాంక్‌లో అగ్నిప్రమాదం.. ఉపకరణాలు దగ్ధం