Cocaine Seized: మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ఘనా దేశానికి చెందిన వ్యక్తిని ఆబ్కారీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద కొకైన్ కొనుగోలు చేసిన సందీప్, లియాఖత్ అనే ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 56 గ్రాముల కొకైన్, ఓ కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఘానాకు చెందిన మోరిస్... మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు ఆబ్కారీ పోలీసులు వారం రోజులుగా నిఘా పెట్టారు. పురానాపూల్ వద్ద ఉన్న మోరిస్‌ను ఆబ్కారీ పోలీసులు అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా, అతని వద్ద కొకైన్ లభించింది. మోరిస్ ఇచ్చిన సమాచారం మేరకు సందీప్, లియాఖత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఇతరులకు విక్రయించేందుకు సందీప్ కొకైన్ కొనుగోలు చేయగా... తన యజమానికి ఇచ్చేందుకు కొకైన్ కొనుగోలు చేసినట్లు లియాఖత్ ఒప్పుకున్నాడు. లియాఖత్ యజమాని యజ్ఞానంద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
చార్మినార్‌కు చెందిన యజ్ఞానంద్ ఈ ఏడాది జనవరిలో పంజాగుట్ట డ్రగ్స్ కేసులోనూ అరెస్ట్ అయ్యాడు. నైజీరియాకు చెందిన టోనీ నుంచి మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసిన 11మంది వ్యాపారుల్లో యజ్ఞానంద్ ఒకరు. నెల క్రితం బెయిల్‌పై బయటికి వచ్చిన యజ్ఞానంద్ మళ్లీ మాదక ద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నట్లు ఆబ్కారీ పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం పరారీలో ఉన్న యజ్ఞానంద్ కోసం ఆబ్కారీ పోలీసులు గాలిస్తున్నారు. యజ్ఞానంద్తో పాటు మరికొంత మంది వ్యాపారులు మోరిస్ వద్ద మాదక ద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నట్లు ఆబ్కారీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. మోరిస్‌ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉంది.