తల్లిదండ్రులు తిడుతున్నారని మాధవి (33) అనే యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పరిధిలోని గాజుల రామారంలో జరిగింది. పది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆ యువతి చివరికి శవమై కనిపించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనా స్థలంలో ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు.
తల్లిదండ్రులు తిడుతున్నారని యువతి ఆత్మహత్య - మేడ్చెల్ జిల్లా నేర వార్తలు
పెళ్లి కావడం లేదన్న కారణంగా తన తల్లిదండ్రులు తిడుతున్నారని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తాను ఎందుకోసం చనిపోవాలనుకుంటుందో తెలుపుతూ ఓ లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజులరామారంలో జరిగింది.
జిల్లాలోని గాజుల రామారానికి చెందిన మణెమ్మ, యాదయ్య దంపతుల కుమార్తె మాధవి 10 రోజుల క్రితం ఇంట్లో నుంచి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకినా.. ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో కొందరు హెచ్ఎంటీ అటవీ ప్రాంతంలో ఓ యువతి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అక్కడ ఓ లేఖ లభ్యమైంది. ఆ లేఖలో మృతురాలి కుటుంబ సభ్యల పేర్లు ఉండడంతో వారికి సమాచారం అందించారు. అయితే తనకు పెళ్లికావడం లేదన్న కారణంగా తన తల్లిదండ్రులు తిడుతున్నారని.. అందుకే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని రాసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:అమానవీయం: ఆకలితో అలమటించి వృద్ధ దంపతులు మృతి