నిజామాబాద్ జిల్లా మోపాల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లికి నిరాకరించిందని ఓ ఉన్మాది యువతి గొంతు కోశాడు. మోపాల్ ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి మానిక్బండార్ గ్రామానికి చెందిన ఓ యువకుడితో రెండేళ్ల క్రితం ఓ పెళ్లిలో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. కొద్దిరోజులు బాగానే ఉన్న యువకుడు.. తర్వాత యువతిపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే గతంలో ఓసారి ఇద్దరి మధ్య గొడవ జరగగా.. యువకుడు యువతిని, ఆమె తల్లిని గాయపరిచాడు. అప్పటి నుంచి యువతి అతడికి దూరంగా ఉంటోంది.
తనను దూరం పెట్టడంతో యువతిపై కక్ష పెంచుకున్న యువకుడు ఆమెను హతమార్చాలని పథకం రచించాడు. సమయం కోసం ఎదురుచూశాడు. గురువారం తన పుట్టినరోజును సాకుగా చూపి.. యువతిని బలవంతంగా బయటకు తీసుకెళ్లాడు. చిన్నాపూర్ గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. తనతో పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. యువతి నిరాకరించడంతో ముందుగా అనుకున్న విధంగా యువతి గొంతు నులిమి చంపేందుకు యత్నించాడు. ఈ క్రమంలో యువతి స్పృహ తప్పి పడిపోగా.. అక్కడే దొరికిన బీరు సీసాను పగులగొట్టి యువతి గొంతులో పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో చనిపోయిందని భావించి అక్కడి నుంచి పరారయ్యాడు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు యువతికి ప్రాణాపాయం లేదని తేల్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.