తెలంగాణ

telangana

ETV Bharat / crime

Wife killed Husband: డబ్బుకోసం భర్తను హత్యచేసి... రెండు నెలలుగా మృతదేహన్ని అక్కడ దాచింది - భర్తను చంపిన భార్య

ఆస్తి అమ్మగా వచ్చిన డబ్బుల విషయంలో దంపతుల మధ్య జరిగిన గొడవ భర్త హత్యకు కారణమైంది. డబ్బుకోసం ఓ మహిళ కట్టుకున్నవాడిని కడతేర్చి... మృతదేహాన్ని శౌచాలయం కింద పాతిపెట్టింది. రెండు నెలల కిందట జరిగిన ఈ హత్యోదంతం... మృతుడి తరఫు బంధువుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన మహబూబ్​నగర్​ జిల్లా నవాబుపేట మండలం ధర్పల్లిలో జరిగింది.

husband murder
husband murder

By

Published : Sep 2, 2021, 3:48 PM IST

రూపాయి రూపాయి నువ్వేమి చేస్తావంటే.. నన్ను సరిగా వినియోగించుకోకపోతే.. పచ్చని కాపురంలో నిప్పులు పోస్తా.. ఎలాంటి బంధాన్నైనా కూలదోస్తా అందట. అలాంటి మాటలకు అతికినట్టుగా సరిపోతుంది ఈ ఘటన. మూడు ముళ్లు వేసిన భర్త ఊపిరి తీసింది ఓ భార్య... ఏడడుగులు నడిచిన వ్యక్తిని ఆరడుగుల గోతిలో పాతేసింది.. ఇదంతా కేవలం ఆస్తి అమ్మగా వచ్చిన డబ్బుకోసమే. ఈఘటన మహబూబ్​నగర్​ జిల్లా నవాబుపేట మండలం ధర్పల్లిలో జరిగింది.

రెండు నెలల క్రితమే..

ధర్పల్లి గ్రామ పంచాయతీ చిన్నంబావికి చెందిన చిన్నయ్య(45) రెండు నెలల క్రితం నుంచి కనిపించకుండా పోయాడు. భార్యతో సహా కుటుంబ సభ్యులు తెలిసిన చోటల్లా గాలించారు. ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలో చిన్నయ్య భార్యపై కుటుంబ సభ్యులకు అనుమానమొచ్చింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

ఇంటి ఆవరణలోనే పాతిపెట్టింది

తన భర్త చిన్నయ్యను తానే హత్య చేశానని రాములమ్మ అంగీకరించింది. మృతదేహాన్ని ఇంటి వద్ద నిర్మించిన మరుగుదొడ్డి కింద పాతిపెట్టానని చెప్పింది. ఇవాళ జేసీబీ సాయంతో ఇంట్లో నిర్మాణాలు తొలగించి చూడగా... కుళ్లిన స్థితిలో ఉన్న చిన్నయ్య మృతదేహం లభించింది.

అసలు గొడవ ఏంటి..

చిన్నయ్య ఇటీవల తన ఆస్తిని అమ్మగా వచ్చిన డబ్బుతో ఇంటిని నిర్మించి తన తోబుట్టువులకు పంచాడు. ఈ విషయంలో భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. డబ్బుల విషయంలో మాటామాటా పెరిగి.. ఆ తగాదాలో మాంగళ్య బంధం కరిగి.. కట్టుకున్నవాడిని చంపేసింది. మృతదేహాన్ని కొత్తగా నిర్మించిన ఇంటి ఆవరణలో ఉన్న మరుగుదొడ్డి కింద గోతిలో పాతిపెట్టింది. అప్పటి నుంచి తమ సోదరుడు కనిపించకపోవడం వల్ల మృతిడి సోదరులు పోలీసులకు చేసిన ఫిర్యాదుతో హత్యోదంతం బయటపడింది.

అవాక్కైన స్థానికులు

డబ్బుకోసం తాళికట్టిన వాడి ఉసురు తీసి... మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే పాతిపెట్టిన ఘటన వెలుగుచూడడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి శవపంచనామా నిర్వహించి నిందితురాలని అరెస్ట్ చేశారు.

ఇదీ చూడండి:Warangal Murders: వరంగల్‌ దారుణ హత్యల కేసు.. ఆరుగురి అరెస్ట్‌

ABOUT THE AUTHOR

...view details