తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఫేస్​బుక్ పరిచయం.. ఆమెకు ప్రాణసంకటం.. విషయం తెలిసిన భర్త ఏం చేశాడంటే.! - ఫేస్​బుక్​లో మోసపోయిన మహిళ

Facebook Love Cheating: సామాజిక మాధ్యమాల్లో అపరిచిత పరిచయాల మోజులో పడి మోసపోవద్దని సైబర్ పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా.. ఇంకా అలాంటి ఘటనలు ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. మోసగాళ్ల మాయమాటలు నమ్మి వారితో పెళ్లి బంధానికి సిద్ధమవుతున్నారు. బాధితుల అదృష్టం బాగుండి.. నిజానిజాలు బయటపడినా తప్పించుకునే వీలు లేకుండా నేరగాళ్లు ఉచ్చు బిగిస్తున్నారు. పెళ్లై ఇద్దరు పిల్లలుండి.. భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్న మహిళ.. ఫేస్​బుక్ స్నేహానికి ఆకర్షితురాలై చివరికి ప్రాణసంకటంలో పడింది.

cheating in the name of love through facebook
ఫేస్​బుక్​లో ప్రేమ పేరుతో మోసం

By

Published : Apr 16, 2022, 7:19 PM IST

Facebook Love Cheating: సికింద్రాబాద్‌లో ఉంటున్న ఓ మహిళ(40)కు 20 ఏళ్ల క్రితం వివాహం జరగ్గా.. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తోంది. ఇటీవల భర్తతో అభిప్రాయభేదాల కారణంగా ఇద్దరూ విడాకులు తీసుకోవాలనుకున్నారు. దీంతో 9 నెలల నుంచి విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో కొత్త పరిచయాలు, వ్యాపార ఆలోచనల కోసం ఆమె తన ఫేస్‌బుక్‌ ఖాతాను క్రియాశీలకంగా మార్చుకుంది. వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన యువతీయువకులను పరిచయం చేసుకుంది. ఈ క్రమంలోనే లుథియానాలో ఉంటున్న 38 ఏళ్ల వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. తన ఆర్థిక పరిస్థితి బాగుందని, ఇద్దరూ పెళ్లిచేసుకుందామంటూ అతడు చెప్పడంతో మహిళ అంగీకరిచింది. దీంతో అతడు రెండునెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. ఇద్దరూ కలిసి దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లారు. వెళ్లేముందు తనకు రూ.లక్ష కావాలంటూ వ్యక్తి కోరగా.. ఆమె తన వద్ద రూ.60 వేలే ఉన్నాయని చెప్పి ఇచ్చింది.

ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా అని భావించిన మహిళ.. ఫేస్‌బుక్‌ కొత్త స్నేహితుడి కుటుంబసభ్యులను కలుసుకునేందుకు నెలరోజుల క్రితం లుథియానాకు వెళ్లింది. అక్కడికి వెళ్లాక పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఫేస్​బుక్ స్నేహితుడు మాటలతో మాయచేశాడని, అతడు ఏ పనిచేయకుండా.. పదవీవిరమణ చేసిన అతడి తండ్రి పింఛన్‌తో జీవిస్తున్నాడని తెలుసుకుని నిర్ఘాంతపోయింది. వారి ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో మోసపోయినట్లు గ్రహించింది. ఇదేంటని అతడి తండ్రిని అడగ్గా.. ఓ హత్యకేసులో ముద్దాయిగా పదేళ్ల క్రితం జైల్లో ఉన్నాడని, ఇటీవలే బయటకు వచ్చాడని చెప్పాడు. ఈలోపు ఆమె స్నేహితుడు రాగా.. తనను మోసం చేశావంటూ నిలదీసింది. దీంతో అతడి తండ్రి జోక్యం చేసుకుని.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చి స్వస్థలానికి పంపించివేశాడు.

నగ్నచిత్రాలు.. మార్ఫింగ్‌ వీడియోలతో బెదిరింపులు..: లుథియానా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కొద్దిరోజులకే.. ఆమె ఫేస్‌బుక్‌ చెలికాడు బెదిరింపులకు పాల్పడ్డాడు. వారిద్దరూ కలిసి దిగిన చిత్రాలను మార్ఫింగ్‌ చేసి వీడియోలను ఆమె చరవాణికి పంపించాడు. వీటిని స్నేహితులు, సన్నిహితులు, కుటుంబసభ్యులకు పంపుతానంటూ బెదిరించాడు. ఆమె లెక్కచేయకపోవడంతో వాటిని ఆమె స్నేహితులకు పంపించాడు. భయపడిన మహిళ ఏం కావాలంటూ అడగ్గా.. తనను పెళ్లి చేసుకోవాలని చెప్పాడు. తనకు ఇష్టంలేదని తిరస్కరించగా.. ఫొటోలు, వీడియోలను యూట్యూబ్‌లో ఉంచుతానంటూ బెదిరించాడు. దీంతో ఆమె సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. ఇక్కడ కొసమెరుపేమిటంటే భార్య పరిస్థితి తెలుసుకున్న భర్త.. తనను ఓదార్చి ఆమెతో పాటు పోలీస్ స్టేషన్​కు వచ్చాడు.

ఇవీ చదవండి:పెళ్లిని అడ్డుకునేందుకు యత్నించిన యువతి.. జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన వరుడి బంధువులు

కాంగ్రెస్‌లోకి పీకే? సోనియా, రాహుల్‌తో భేటీ..

ABOUT THE AUTHOR

...view details