WOMAN CHEAT WITH MAKEUP:ఆమె ఓ మాయలేడి. మేకప్ వేసి.. తన అందచందాలను చూపిస్తూ.. మాటలతో మోసం చేస్తూ ఒకరి తర్వాత ఒకరి చొప్పున మొత్తం ముగ్గురిని వివాహమాడింది. చివరికి ఆమె ఆధార్ కార్డును మూడో భర్త పరిశీలించినప్పుడు అసలు రంగు బయటపడింది. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. చివరికి కటకటాలపాలైంది. మంగళవారం ఏపీ తిరుపతి జిల్లా పుత్తూరు సీఐ లక్ష్మీనారాయణ ఈ మాయలేడి వివరాలను వెల్లడించారు.
పుత్తూరుకు చెందిన శరణ్యకు అదే పట్టణంలోని రవితో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక భేదాభిప్రాయాలు రావడంతో వేరుగా ఉంటున్నారు. అనంతరం శరణ్య తన పేరును సుకన్యగా మార్చుకుంది. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్రం వేలూరు ప్రాంతానికి చెందిన సుబ్రమణ్యంను పెళ్లాడింది. ఆపై 11 ఏళ్లు కాపురం చేసింది. కరోనా సమయంలో తల్లిని చూసేందుకు వచ్చిన ఆమె తిరిగి వెళ్లలేదు. ఆర్థిక కష్టాలు ఎదురుకావడంతో కొందరు పెళ్లిళ్ల బ్రోకర్లతో పరిచయం పెంచుకుంది. బ్యూటీపార్లర్‌లో మేకప్ వేసుకుని సంధ్యగా పేరు మార్చుకుని ఫొటోలు వివాహ వెబ్‌సైట్లలో పెట్టింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పుదుపేటకు చెందిన ఇంద్రాణి కుమారుడు గణేశ్‌కు 2021లో ఓ పెళ్లి బ్రోకర్ ద్వారా పరిచయమైంది. వారు తిరువళ్లూరులో వైభవంగా పెళ్లి చేసుకున్నారు.