తెలంగాణ

telangana

ETV Bharat / crime

పెళ్లి సంబంధాల పేరిట లక్షలు దోచుకుంటున్న మహిళ - తెలంగాణ వార్తలు

పెళ్లి సంబంధాల పేరిట అబ్బాయిల ఫొటోలను చూపిస్తూ డబ్బులు కాజేస్తున్న కిలాడీ లేడీ మోసాలకు నల్గొండ పోలీసులు చెక్ పెట్టారు. సామాజిక మాధ్యమాల్లోని యువకుల ఫొటోలతో మంచి ఉద్యోగం చేస్తున్నారని... సంబంధం మాట్లాడుతానని చెప్పి సొమ్ము చేసుకుంటోందని పోలీసులు తెలిపారు. పదుల సంఖ్యలో బాధితులు న్యాయం కావాలని తమను ఆశ్రయించారని వెల్లడించారు.

a woman arrest, nalgonda police
చీటింగ్ కేసులో మహిళ అరెస్ట్, నల్గొండ పోలీసులు

By

Published : May 2, 2021, 7:45 AM IST

పెళ్లి సంబంధాల పేరిట అబ్బాయిల పేర్లు మార్చి చెప్తూ మోసాలకు పాల్పడుతున్న మహిళను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా వలపు వల విసురుతూ డబ్బులు వసూలు చేస్తోందని తెలిపారు. పదుల సంఖ్యలో బాధితులు న్యాయం చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారని వెల్లడించారు. అబ్బాయిల ఫొటోలను అమ్మాయిల తల్లిదండ్రులకు చూపిస్తూ... నకిలీ పేర్లతో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారంటూ నమ్మబలికి డబ్బులు తీసుకుంటుందని పేర్కొన్నారు. మరోవైపు ఆ అబ్బాయిలను వేధిస్తూ డబ్బులు ఇవ్వకపోతే కేసుల్లో ఇరికిస్తానని బెదిరింపులకు పాల్పడుతోందని చెప్పారు.

ఫొటోలతోనే మోసాలు

ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పంతంగి మహేశ్వరి అలియాస్ ఇందు దాసరి అలియాస్ ధరణి రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై నల్గొండ వన్ టౌన్, మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో ఆమెను అరెస్టు చేసినట్లు ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఈ కిలాడీ లేడీపై నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ల్​లో హైదరాబాద్ కొంపల్లికి చెందిన బొమ్మెల వెంకటేశ్ ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తమను బెదిరించి డబ్బులు తీసుకోవడమే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఫొటోలను ఉపయోగించి పెళ్లి సంబంధాల పేరిట ఆడపిల్లల తల్లిదండ్రులను మోసం చేస్తోందని పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేయగా అసలు విషయాలు బయటకు వస్తున్నాయని వివరించారు.

నగ్న వీడియో చాట్

ఆ మహిళతో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం ఏర్పడినట్లు, నగ్నంగా వీడియో ఛాటింగ్ చేసి బెదిరిస్తోందని బాధితులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. డబ్బులు ఇవ్వకపోతే కేసుల్లో ఇరికిస్తానని వేధిస్తోందని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లోని ఫొటోలతో ఈ వ్యవహారం నడిపిస్తోందని తెలిపారు. బాధితుల నుంచి రూ.నాలుగున్నర లక్షలు వసూలు చేసిందని చెప్పారు. ఈ విషయంలో కూకట్​పల్లి పోలీసు స్టేషన్​లో కేసు నమోదు అయిందని అన్నారు. యువకుడి పేరుతో ఘట్​కేసర్​కి చెందిన ఓ యువతితో స్నేహం పెంచుకొని రూ.1,75,000 వసూలు చేసినట్లు వివరించారు. ఆ కేసు విచారణలో ఉన్నట్లు పేర్కొన్నారు.

ఖమం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కూతురికి మంచి సంబంధం చూస్తానని చెప్పి రూ.7లక్షలు అడుగుతున్నారని చెప్పి తీసుకుందని తెలిపారు. మరో యువతి నుంచి రూ.మూడు లక్షలు కాజేసిందని వెల్లడించారు. మొత్తం రూ.11,70,000 వసూలు చేసి ప్రస్తుతం నల్గొండ పట్టణంలో నివాసం ఉంటున్నట్లుగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఈ కిలాడీ లేడీపై కూకట్​పల్లి, ఘట్ కేసర్, ఖమ్మం, సత్తుపల్లి, వేంసూరు పోలీస్ స్టేషన్లతో పాటు కరింనగర్ షీ టీమ్, గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసు విషయంలో సమర్థవంతంగా పని చేసిన మహిళా పోలీస్ స్టేషన్ ఇన్​స్పెక్టర్ రాజశేఖర్ గౌడ్, నల్గొండ వన్ టౌన్ ఇన్​స్పెక్టర్ నిగిడాల సురేశ్​లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ఇదీ చదవండి:ఘరానా మోసగాళ్ల ముఠా ఆటకట్టు.. పీడీ చట్టం నమోదు

ABOUT THE AUTHOR

...view details