Transport Officer Collecting Money Illegally: అదే జిల్లా, అదే ఊరు, అదే ప్రదేశం, అదే బాధితులు.. కేవలం అక్రమ వసూళ్లకు పాల్పడే వ్యక్తులు మారారు. మిగతా అంతా సేం టూ సేం. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ శివారులో, 44జాతీయ రహదారిపై ఉన్న టోల్‌గేట్ వద్ద రేడియం స్టిక్కర్ల పేరిట సాగుతున్న అక్రమ వసూళ్లను, ఈటీవీ తెలంగాణ గతనెలలో వెలుగులోకి తెచ్చింది. నెలన్నర గడవకముందే అక్కడే మరో కొత్త తరహా దందా మొదలైంది. అప్పుడు పోలీసుశాఖ వంతుకాగా, ఈసారి రవాణాశాఖ వంతు.
తూప్రాన్ టోల్‌గేట్ వద్ద రాత్రి సమయాల్లో మళ్లీ వాహనాలు ఆపి వసూళ్లకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఈటీవీ- ఈనాడు నిఘా పెట్టింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లే మార్గంలో టోల్‌గేట్ దాటగానే రోడ్డు మధ్యలో నలుగురు నిలబడి చేతిలోని టార్చిలైట్‌తో డ్రైవర్ల కళ్లలోకి ఫోకస్ కొట్టి వాహనాలు ఆపుతున్నారు. తనీఖీల పేరిట పత్రాలు పరిశీలించి, సరైనవి లేని వారి నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు.
రోడ్డు పక్కన ఓ ఇన్నోవా వాహనంలో కూర్చున్న రవాణాశాఖ అధికారి మహమ్మద్ అఫ్రోజ్, కనుసన్నల్లో ఈ వ్యవహారం సాగుతోంది. వాహనాలు ఆపుతున్న వ్యక్తులు ఎవరు? ఎందుకు అపుతున్నారని రవాణాశాఖ అధికారి మహమ్మద్ అఫ్రోజ్‌ను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. వీడియో చిత్రీకరణను గమనించిన ప్రైవేట్ వ్యక్తులు అక్కడినుంచి మెల్లిగా జారుకున్నారు.