ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఓ కార్ల దొంగకు వరంగా మారింది. ఓ అంతర్రాష్ట్ర దొంగ.. ఖరీదైన కార్లను దొంగిలిస్తూ నగర పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. దమ్ముంటే తనను పట్టుకోవాలని ఏకంగా పోలీసులకే ఫోన్ చేసి సవాల్ విసిరాడు. పట్టుకోవడం మీ తరం అవుతుందా అని మీసం మెలేశాడు. పోలీసులకు చెప్పి మరీ దొంగతనాలు చేయటం.. సినీ ఫక్కీలో తప్పించుకుంటుండటంతో ఈ కేసు పోలీసులకు ఓ సవాల్‌గా మారింది.
ఇదీ కథ..
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని పార్క్ హయత్ హోటల్లో జనవరి 26న రాత్రి కన్నడ సినీ నిర్మాత వి.మంజునాథ్‌కు చెందిన (కేఏ 04 ఎంఎక్స్ 1000) ఫార్చునర్ కారు అపహరణకు గురైంది. మంజునాథ్ ఇచ్చిన ఫిర్యాదుతో దొంగను పట్టుకోవడానికి స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు.
నగరంలో ఖరీదైన కార్లను దొంగిలిస్తున్న వ్యక్తిపై నిఘా ఉంచారు. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నగరంలో కార్లను దొంగిలిస్తున్నది రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అంతర్రాష్ట్ర కార్ల దొంగ సత్యేంద్రసింగ్ షెకావత్‌గా గుర్తించారు. ఇతడిని గతంలో దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపగా.. బెయిల్‌పై విడుదల అయినట్లు తెలుసుకున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక సత్యేంద్రసింగ్ షెకావత్ కన్ను.. ఈసారి హైదరాబాద్ నగరంపై పడినట్లు గుర్తించారు.
'నేను ఇక్కడే ఉన్నాను. పట్టుకునే దమ్ముందా'..
ఈ క్రమంలోనే 'పార్క్ హయత్' కారు సత్యేంద్ర షెకావత్ అపహరించాడని నిర్ధారించుకుని అతడిని పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందం రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లింది. పోలీసుల రాకను పసిగట్టిన సత్యేంద్రసింగ్ షెకావత్.. పోలీసులకు వాట్సప్ కాల్ చేశాడు. 'నేను ఇక్కడే ఉన్నాను. నన్ను పట్టుకునే దమ్ముందా.. పట్టుకోండి చూద్దాం..' అని సవాల్ విసిరాడు. మీరు వాడుతున్న టెక్నాలజీ చాలా పాతది.. అప్డేట్ అవ్వండి అని సలహా ఇచ్చి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.