AUNT BEATEN HER NEPHEW: చిన్న పిల్లలన్నాక అల్లరి చేయడం సహజం. ఏది మంచో ఏది చెడో తెలియని స్థితిలో చిలిపి చేష్ఠలు చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో పెద్దవారు ప్రేమతో దగ్గరకు తీసుకుని మంచి మాటలు చెప్పి వారిని తీర్చిదిద్దాలి. కానీ ఇక్కడ మాత్రం ఓ మహిళ.. అల్లరి చేస్తున్నాడని ఇష్టానుసారంగా కొట్టడంతో ఆ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లాలోని ఓంశాంతి నగర్‌కు చెందిన శివయ్య, భాగ్యమ్మ అనే భార్యాభర్తలు జీవనోపాధి కోసమని నెల రోజుల క్రితం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. తమ పదేళ్ల కుమారుడు అయాన్‌ను బాలుడి మేనత్త ఇంట్లో వదిలిపెట్టారు. అయితే బాలుడు తరచూ అల్లరి చేస్తున్నాడని విసుగు చెందిన అతని మేనత్త.. అయాన్ తొడ వద్ద కాల్చింది. దాంతో ఆ బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. గమనించిన బంధువులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. బాలుడి మేనత్త, మామ పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న బాలుడి మేనత్త, మామ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.