విద్యార్థులు ఎక్కువగా తల్లిదండ్రుల దగ్గర కంటే పాఠశాలలో ఉపాధ్యాయుల వద్దే ఎక్కువ సమయం గడుపుతుంటారు. అలాంటప్పుడు పిల్లలను ప్రేమగా చూసుకోవాల్సిన టీచర్లు, పాఠశాల యాజమాన్యం వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. పాఠశాలలో చిన్న చిన్న తప్పులు చేసినా పెద్ద శిక్షలు వేస్తున్నారు. పిల్లలను క్రమశిక్షణగా ఉంచాల్సిన ఓ టీచర్... క్రమశిక్షణ తప్పి చిన్న పిల్లలు అని చూడకుండా కోపంతో ఊగిపోయి ఓ విద్యార్థిని చితక బాదాడు.
భువనగిరి పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన విద్యార్థి ఆరో తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలకు వెళ్లిన బాలుడు తరగతి విరామంలో పక్క తరగతి గదికి వెళ్లాడు. ‘పక్క తరగతికి వెళ్లి అల్లరి చేస్తున్నావంటూ’ ఉపాధ్యాయుడు ప్లాస్టిక్ స్కేల్‌తో వీపు, తలపై కొట్టాడని విద్యార్థి వాపోయాడు (teacher who beat student). బాలుడి వీపు ఎర్రగా కమిలిపోవడంతో అతని కుటుంబ సభ్యులు పాఠశాలకు వెళ్లి ఆందోళనకు దిగారు. పాఠశాల ప్రిన్సిపల్, యాజమాన్యాన్ని నిలదీశారు. ‘విద్యార్థిని ఎందుకు కొట్టారని అడిగితే.. పాఠశాల యజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింద’ని, అధికారులు ఆ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.