వడ్డీ వ్యాపారుల వేధింపులు, బ్యాంకు రుణాలు చిరు వ్యాపారులను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. పెట్టిన పెట్టుబడి రాక, చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఓ చిరు వ్యాపారి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఆదిలాబాద్ పట్టణం భుక్తాపూర్ కాలనీకి చెందిన జక్కుల శ్రీనివాస్.. చిన్న వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు. కరోనా కారణంగా వ్యాపారంలో నష్టం రావడంతో చేసిన అప్పులు తీర్చలేక పోయారు. దీంతో వడ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జిల్లా కేంద్రానికి 20కి.మీ దూరంలోని గుడిహట్నూర్ శివారులోని పంట చేలో సెల్ఫీ వీడియో తీసుకుని తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆ తర్వాత పురుగుల మందు తాగి తనువు చాలించారు. తన చావుకు అప్పులే కారణమంటూ శ్రీనివాస్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. తన పిల్లలు బంగారమని.. అప్పులు తీర్చలేకే చనిపోతున్నానని రోధించారు.