భాగ్యనగరం నడిబొడ్డులో దారి దోపిడి జరిగింది. అర్థరాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకులను.. ఆపి బెదిరించి బైక్ తీసుకుని దుండగులు పరారైన ఘటన బంజారాహిల్స్‌లో చోటు చేసుకుంది.
హైదరాబాద్‌లో అసలేం జరుగుతోంది.. మెయిన్ సెంటర్లలో ఈ దోపిడీలేంటి?
14:00 November 09
బంజారాహిల్స్‌లో దారి దోపిడి
బజార్‌ఘాట్‌కు చెందిన ఇలియాస్ తన మిత్రులైన అనస్, జునైల్‌లతో కలిసి బైక్‌పై తాజ్‌మహల్ హోటల్ దగ్గర నుంచి గోల్కొండ వైపు వెళ్తున్నాడు. అప్పటికే మాటు వేసిన దుండగులు.. వారిని అడ్డుకుని, బెదిరించి బైక్ తీసుకుని పారిపోయారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఓ ఆటోను ఆపి డ్రైవర్ వద్ద ఉన్న సెల్‌ఫోన్ లాక్కుని వెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ నడిమధ్యలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు కేసు ఛేదించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. జల్సాలకు అలవాటుపడి వ్యసనాల బారిన పడిన 7గురు సభ్యులు ముఠాగా ఏర్పడి దారి దోపిడీలు చేస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
వరుస దొంగతనాలతో
కొన్ని రోజుల క్రితం బంజారాహిల్స్ రోడ్డు నెం 12లోనూ దారి దోపిడీ జరిగింది. ఓ బ్యాంకు మేనేజర్‌ను బెదిరించిన రౌడీ షీటర్.. ఆమె నుంచి 40వేలు లాక్కెళ్లాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు అతనిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 15 రోజుల క్రితం లంగర్ హౌజ్ పీఎస్ పరిధిలోని అత్తాపూర్ సమీపంలో ఓ ద్విచక్రవాహనదారుడిని బెదిరించిన ఐదుగురు వ్యక్తులు చరవాణితో పాటు బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. పోలీసులు 24 గంటల్లో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన రహదారులపైనే దారిదోపిడీలు జరగుతుండటంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి:విదేశీయులపై సమాచారం అంతంతే.. వీసాల్లేవ్... వివరాలూ తెలియవ్!