Prisoner Escaped: ఏపీలోని కర్నూలు జిల్లా కారాగారం నుంచి నిందితుడు చెంచు కుళాయి అలియాస్ నాని వారం రోజుల్లోనే రెండోసారి తప్పించుకున్నాడు. హత్యాయత్నం కేసులో గత నెల 16 నుంచి జైలులో ఖైదీగా ఉన్న నాని.. వారం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు కారాగారం నుంచి తప్పించుకున్నాడు. గత శుక్రవారం(మార్చి 11) రోజున నాని.. ఇదే జైలు గోడ దూకి తప్పించుకున్నాడు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వలో ఉన్న అతడి అక్క ఇంటికి వెళ్లగా.. జైలు సిబ్బంది పట్టుకున్నారు.
దీంతో నిందితుడిపై తాలూకా అర్బన్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి జైలు సిబ్బంది అతడిని ప్రత్యేక బారక్లో ఉంచారు. ఈరోజు ఉదయం బాత్రూంకి వెళ్తానని చెప్పి మరోసారి గోడ దూకి తప్పించుకుని పారిపోయాడు. రెండోసారి కూడా తప్పించుకోవటంతో.. అతడిని పట్టుకునే పనిలో జైలు సిబ్బంది నిమగ్నమయ్యారు.