marrying four people : మొదటి భార్య ఫిర్యాదుతో ఓ నిత్య పెళ్లికొడుకు బండారం బయటపడింది. మాయమాటలతో నలుగురిని పెళ్లి చేసుకున్న నారాయణపేట జిల్లాలోని అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటనర్సింహారెడ్డి(44)ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వేధింపులు తట్టుకోలేక మొదటి భార్య సఖీ కేంద్రాన్ని సంప్రదించారు. దీంతో రంగంలోకి దిగిన షీటీం అతన్ని అదుపులోకి తీసుకుంది. ఇంటికి పెద్ద దిక్కులేని.. ఏదిచేసినా అడిగేవారు ఉండని కుటుంబాల మహిళలనే లక్ష్యంగా చేసుకుని లొంగదీసుకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటనర్సింహారెడ్డి(44) తాపీ మేస్త్రీ. 2009లో ధన్వాడ మండలంలోని రాంకిష్టయ్యపల్లికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక పాప, బాబు పుట్టారు. మొదటి భార్యకు తెలియకుండా 2012లో అప్పటికే పెళ్లై ఒకపాప ఉన్న అప్పిరెడ్డిపల్లికి చెందిన మహిళను గుడిలో రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తరవాత రెండో పెళ్లి విషయం మొదటి భార్యకు తెలిసింది. భర్త వేధింపులు భరించలేక, అతడి వ్యవహారం నచ్చక కొన్నేళ్లుగా దూరంగా ఉంటోంది.
నర్సింహారెడ్డి అప్పుడప్పుడు పనికోసం హైదరాబాద్‌కు వెళ్లే క్రమంలో అక్కడ పనిచేస్తున్న కోయిలకొండ మండలానికి చెందిన మహిళను మూడోపెళ్లి చేసుకుని అక్కడే కాపురం పెట్టాడు. భర్త ఇంటికి రావడం లేదని రెండో భార్య వెళ్లి ఆరా తీయగా మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు తెలిసి, దూరంగా ఉండసాగింది. ఈ క్రమంలోనే నారాయణపేట మండలం అప్పక్‌పల్లికి చెందిన మరో మహిళకు తనకు ఇంకా పెళ్లికాలేదని చెప్పి గత నెలలో నాలుగో పెళ్లి చేసుకున్నాడు.