తన పొత్తిళ్లలో సురక్షితంగా ఉండాల్సిన ఆడ శిశువును.. మాతృత్వపు మమకారాన్ని మరిచిన ఓ కన్నతల్లి రూ.3 వేలకు విక్రయించింది. పుట్టిన ఐదు రోజులకే డబ్బుల కోసం అంగట్లో సరకులా అమ్మేసింది. సొమ్ముల విషయంలో తలెత్తిన వివాదం అంగన్‌వాడీ కార్యకర్తలకు చేరడంతో ఈ ఘటన వెలుగుచూసింది. హైదరాబాద్ బాచుపల్లి మమతా ఆసుపత్రి ఎదురుగా గుడిసెల్లో చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవించే కుటుంబాలు నివసిస్తున్నాయి. అదే వృత్తితో రాధ, రాజు దంపతులు ఉపాధి పొందుతున్నారు. వీరికి ఓ ఆడబిడ్డ జన్మించి కామెర్లతో చనిపోయింది. ఈనెల 10న రాధ మరోసారి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువును ఐదు రోజులపాటు ఉంచుకున్న ఆమె.. తమ పొరుగు గుడిసెలో ఉంటున్న శాంతమ్మకు రూ.3 వేలకు విక్రయించింది.
5 రోజుల ఆడశిశువును రూ.3 వేలకు విక్రయించిన తల్లి
12:50 June 18
5 రోజుల ఆడశిశువును రూ.3 వేలకు విక్రయించిన తల్లి
పసికందును కొనుగోలుచేసిన ఆ మహిళ ఇతరులకు ఎక్కువ మొత్తానికి అమ్మే ప్రయత్నాల్లో ఉన్నట్లు రాధ గుర్తించింది. రూ.3 వేలు ఇస్తానని, తన బిడ్డను తిరిగి ఇచ్చేయాలని కోరింది. రూ.పది వేలు చెల్లిస్తేనే తిరిగి ఇస్తానంటూ శాంతమ్మ పేచీ పెట్టింది. ఇరువురి మధ్య తలెత్తిన వివాదం స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త మణిమాల దృష్టికి వెళ్లింది. గురువారం సాయంత్రం ఆమె ఆ ప్రాంతానికి చేరుకొని సూపర్‌వైజర్ దుర్గ, బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించింది. చీకటిపడటంతో పసిగుడ్డును మణిమాల సంరక్షణలోనే ఉంచారు.
శుక్రవారం ఉదయం మణిమాల పాపను బాచుపల్లి ఠాణాకు తీసుకొచ్చింది. మేడ్చల్ జిల్లా బాలల సంరక్షణ విభాగం ప్రతినిధి భానుప్రకాష్, ఛైల్డ్‌లైన్ కౌన్సిలర్ అరుణ, సూపర్‌వైజర్ దుర్గ అక్కడికి చేరుకున్నారు. రాధ, శాంతమ్మను పోలీసులు విచారించారు. పసిగుడ్డును తల్లికి అప్పగించడం శ్రేయస్కరం కాదని భావించి అమీర్‌పేటలోని శిశువిహార్‌కు తరలించారు. ఎందుకు విక్రయించావని రాధను ప్రశ్నించగా.. భర్త వైద్యం కోసమని చెప్పింది. అతను భర్త కాదని, కొన్నాళ్లుగా సహజీవనం సాగిస్తున్నట్లు తెలిసింది. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెపై ఇదే ఠాణాలో రెండు కేసులున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి :అమ్మమ్మ షరతు- చనిపోయిన బాలుడు బతికొచ్చాడు