తెలంగాణ

telangana

ETV Bharat / crime

GANG RAPE: వేటకొడవళ్లతో బెదిరించి.. భర్తను కట్టేసి.. భార్యపై అత్యాచారం - ఆంధ్రప్రదేశ్​ వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లాలో మరోసారి మానవ మృగాలు దారుణానికి పాల్పడ్డారు. రాత్రి సమయంలో దారిలో వెళ్తున్న భార్యభర్తలను అటకాయించి... వారిపై దాడి చేశారు. అనంతరం భర్తను కట్టేసి భార్యపై అఘాయిత్యానికి తెగబడ్డారు. వేటకొడవళ్లతో బెదిరించి నగలు, నగదు కూడా కాజేశారు. ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోని సీతానగరం పుష్కరఘాట్‌ వద్ద మూడు నెలల కిందట జరిగిన సామూహిక అత్యాచార ఘటన మరవకముందే.. అదే తరహా దారుణం అదే జిల్లాలో చోటుచేసుకోవడం ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపింది.

GANG RAPE
భర్త ముందే భార్యపై అత్యాచారం

By

Published : Sep 10, 2021, 8:23 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. నగరానికి 28 కి.మీ దూరంలో.. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో వైవాహిక యువతిపై ఆగంతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దోపిడీ దొంగల ముఠా తరహాలో దారికాసి అటకాయించిన దుండగులు.. ఆలుమగలిద్దరినీ తీవ్రంగా కొట్టి చిత్రహింసల పాల్జేశారు. భర్తను కట్టేసి భార్యపై అఘాయిత్యానికి తెగబడ్డారు. వేటకొడవళ్లతో బెదిరించి నగలు, నగదు కూడా కాజేశారు. ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోని సీతానగరం పుష్కరఘాట్‌ వద్ద మూడు నెలల కిందట జరిగిన సామూహిక అత్యాచార ఘటన మరవకముందే.. అదే తరహా దారుణం అదే జిల్లాలో చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం..

కర్ర అడ్డం పెట్టి.. కింద పడగొట్టి..

గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన దంపతులు (భార్య 26, భర్త 30 ఏళ్లు) బుధవారం మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. రాత్రి 9.45 గంటలకు స్వస్థలానికి బయల్దేరారు. 2.50 కి.మీ దూరం ప్రయాణించాక.. దారికి అడ్డంగా వేసి ఉన్న ఓ చెట్టు కొమ్మ ఎదురుపడింది. దానిపై నుంచే వాహనాన్ని ముందుకు పోనివ్వగా.. దుండగులు కర్ర అడ్డంపెట్టి బైక్‌ పైనుంచి వారిద్దరినీ కిందపడగొట్టారు. వెంటనే ఇద్దరిపై పిడిగుద్దులు కురిపించి తీవ్రంగా గాయపరిచారు. తర్వాత కొడవళ్లు చూపించి చంపేస్తామని బెదిరించారు. సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లారు. ఆ మార్గంలో వెళ్లేవారికి అనుమానం రాకుండా బాధితుల బైకును పొలాల్లోకి దించేశారు. బాధితురాలి భర్త బనియను, దుస్తుల్ని చించేసి వాటితోనే అతన్ని కట్టేశారు. అతని వద్ద ఇద్దరు దుండగులు కాపలా కాయగా, మరో ఇద్దరు బాధితురాల్ని ఓ చెట్టు కిందకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. రాత్రి 12.40 గంటల వరకూ భార్యాభర్తలిద్దరినీ తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు.

నగలు దోపిడీ

అనంతరం నలుగురు దుండగులు బాధితురాలి మెడలోని మంగళసూత్రం, చెవిదుద్దులు, వెండి కాళ్లపట్టీలు, రూ.5 వేల నగదు దోచుకున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ కొడవళ్లు చూపించి బెదిరించారు. ఎవరికీ చెప్పబోమని బాధితులు అన్న తర్వాతే విడిచిపెట్టి పరారయ్యారు. ఆ సమయంలో ఓ ఫోన్‌ నంబర్‌ కూడా బాధితులకు ఇచ్చారు. దాన్ని పరిశీలించగా, అది మధ్యప్రదేశ్‌కు చెందిన నంబర్‌గా తేలింది. ఆగంతుకుల్లో ముగ్గురు తెలుగులో మాట్లాడారని.. ఓ వ్యక్తి మాత్రమే వేరే భాషలో మాట్లాడినట్లు బాధితురాలు పోలీసులకు వివరించారు. వారంతా ముఖాలకు మాస్కులు ధరించినట్లు చెప్పారు. స్థానికులే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో మేడికొండూరు మండలంలో ఈ తరహాలో రెండు, మూడు దోపిడీ ఘటనలు చోటుచేసుకున్నందున వీటి వెనుక ఏదైనా ముఠా ఉందా? ఇదీ దోపిడీ దొంగల పనేనా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.

స్థానిక కూలీల విచారణ

ఘటనాస్థలికి అర కిలోమీటరు దూరంలో ఓ శీతల గిడ్డంగి నిర్మాణం జరుగుతోంది. ఒడిశా, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారితో పాటు స్థానికులు ఇక్కడ నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. గురువారం ఉదయం ఘటనా స్థలానికి క్లూస్‌టీమ్‌ వెళ్లింది. వారితో తీసుకెళ్లిన జాగిలం ఈ శీతలీకరణ కేంద్రం వైపు వెళ్లి ఆగింది. పోలీసులు అక్కడ పనిచేస్తున్న 25 మంది కూలీల వేలిముద్రలు సేకరించారు. బాధితురాలిని గురువారం ఉదయం 8:15కు గుంటూరు జీజీహెచ్‌లో చేర్చారు. వైద్యులు పరీక్షించి కాన్పుల విభాగం వార్డుకు తరలించి పలు రకాల పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు.

జీరో ఎఫ్‌ఐఆర్‌ ఏది?

ఘటనా స్థలం నుంచి రాత్రి 12.45 గంటలకు బయల్దేరిన బాధితులు ఒంటిగంటకల్లా సత్తెనపల్లి పట్టణ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. వారి నుంచి సమాచారం తెలుసుకుని వెంటనే జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి దర్యాప్తు చేపట్టాల్సిన అక్కడి పోలీసులు.. అది తమ పరిధిలోకి రాదంటూ మేడికొండూరుకు ఠాణాకు సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసులు సత్తెనపల్లి స్టేషన్‌కు చేరుకునే వరకూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు ప్రక్రియ పూర్తికాలేదు. చివరికి బాధితుల్ని మేడికొండూరు ఠాణాకు తీసుకెళ్లి అక్కడ కేసు పెట్టారు. ఈ ప్రక్రియ జాప్యమవ్వటంతో నిందితులు తప్పించుకునేందుకు ఆస్కారం ఏర్పడిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆపదలో ఉన్న బాధితులు ఫిర్యాదు చేసేందుకు వస్తే.. ఘటనాస్థలం తమ పరిధిలోకి రాదనో, మరో పోలీసుస్టేషన్‌కు వెళ్లండనో చెప్పొద్దని, జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు పదేపదే చెబుతున్నా క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు.

కోడెల శివరాం నివాసం వద్ద బందోబస్తులో

సత్తెనపల్లి పట్టణ పోలీసుస్టేషన్‌కు బాధితులు వచ్చిన తర్వాత సెంట్రీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ ఆ సమాచారాన్ని సీఐకో, ఎస్సైకో కాకుండా క్రైమ్‌ కానిస్టేబుల్‌కు చెప్పారు. పట్టణ సీఐ సెలవులో ఉన్నారు. నరసరావుపేటలో గురువారం తెదేపా నేత లోకేశ్‌ పర్యటన నేపథ్యంలో తెదేపా నేత కోడెల శివరాంను పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. సత్తెనపల్లి పట్టణ ఎస్సై ఒకరు శివరాం ఇంటి వద్ద బందోబస్తు విధుల్లో ఉన్నారు. మరో ఎస్సై అందుబాటులో లేరు. పట్టణ పోలీసుస్టేషన్‌కు ఇన్‌ఛార్జి ఎస్‌హెచ్‌వోగా వ్యవహరిస్తున్న గ్రామీణ స్టేషన్‌ సీఐ కూడా శివరాం ఇంటి వద్దే బందోబస్తు విధుల్లో ఉన్నారు. దీంతో సత్తెనపల్లి పోలీసులు ఓ కానిస్టేబుల్‌ను ఘటనా స్థలానికి పంపించారు. అంత తీవ్రస్థాయి నేరం జరిగితే పోలీసులు అప్పటికప్పుడు ఓ బృందాన్ని నియమించి ఘటనా స్థలానికి పంపించలేదన్న విమర్శలు ఉన్నాయి.

సత్వరం స్పందించాం

పాలడుగు వద్ద జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై తాము సత్వరమే స్పందించామని సత్తెనపల్లి డీఎస్పీ ఆర్‌.విజయభాస్కర్‌రెడ్డి చెప్పారు. గురువారం ఇక్కడి పోలీసుస్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘బాధిత దంపతులు బుధవారం రాత్రి ఒంటి గంట సమయంలో పోలీసుస్టేషన్‌కు వచ్చారు. సెంట్రీ శ్రీనివాసరావు విధుల్లో ఉన్నారు. బాధితుల నుంచి విషయం తెలుసుకుని క్రైమ్‌ కానిస్టేబుల్‌కు సమాచారమిచ్చారు. అతను ఆ విషయాన్ని మేడికొండూరు పోలీసులకు తెలియజేసి.. వెంటనే ఘటనా స్థలానికి బయల్దేరారు. అటువైపు నుంచి మేడికొండూరు పోలీసులు కూడా పయనమయ్యారు. ఇదంతా ఆరేడు నిమిషాల్లోనే జరిగింది. ఈ లోగా సత్తెనపల్లి ఠాణాలో ఉన్న మరో కానిస్టేబుల్‌ బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. అదే సమయంలో మేడికొండూరు పోలీసులు సత్తెనపల్లి స్టేషన్‌కు వచ్చి, బాధితురాలిని వారి వెంట తీసుకెళ్లి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మా సిబ్బంది మనోధైర్యం కల్పించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయటం సరికాదు. మేము సత్వరం స్పందించామనేందుకు అవసరమైన కాల్‌డేటా, రికార్డింగ్‌ ఆధారాలు ఉన్నాయి’ అని విజయభాస్కర్‌రెడ్డి వివరించారు.

- విజయభాస్కర్‌రెడ్డి, డీఎస్పీ, సత్తెనపల్లి

ఇదీ చదవండి:Live Murder: వంతెనపై కిరాతకంగా హత్య చేశారు

ABOUT THE AUTHOR

...view details