Man Killed Four People in Hyderabad: హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన ఆరతి, నారాయణగూడ ఫ్లైఓవర్ కింద పూలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఎనిమిది ఏళ్ల క్రితం ఆరతికి, నాగసాయి అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు జన్మించగా, ఐదేళ్ల పాటు వీరి కాపురం బాగానే సాగింది. మూడేళ్ల క్రితం నాగసాయికి, ఆరతి సోదరుడు జితేందర్ మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో జితేందర్‌ను హత్య చేసేందుకు యత్నించి, నాగసాయి జైలుకెళ్లాడు.
Man Killed Four People with petrol attack in Hyderabad : మూడేళ్లుగా నాగసాయి జైలులో ఉండగా, నాగరాజు అనే మరో వ్యక్తిని ఆరతి వివాహం చేసుకుంది. వీరికి 10నెలల బాబు విష్ణు ఉండగా, ప్రస్తుతం ఆమె గర్భంతో ఉంది. ఇటీవల జైలు నుంచి విడుదలైన నాగసాయి, ఆరతి మరో వివాహం చేసుకుందన్న విషయం తెలుసుకుని కోపం పెంచుకున్నాడు. వారిని వదిలేసి తనకు వద్దకు రావాలని హెచ్చరించినా, ఆరతి అందుకు అంగీకరించలేదు.
దీంతో ఎలాగైనా వారిని అంతమొందించాలని భావించిన నాగసాయి.. స్నేహితుడు రాహుల్‌తో కలిసి పథకం పన్నాడు. ఈ నెల 7న నారాయణగూడ ఫ్లైఓవర్ కింద పూలు అమ్ముకుంటున్న నాగరాజు-ఆరతి దంపతుల వద్దకు వెళ్లిన నాగసాయి, వారితో గొడవపడ్డాడు. రాత్రి 8గంటల సమయంలో నాగరాజు-ఆరతితో పాటు వారి వద్ద ఉన్న 10నెలల బాబు విష్ణుపై పెట్రోల్ పోసి, నిప్పంటించి పారిపోయాడు.