వనపర్తి జిల్లాలో జరిగిన యువతి సాయిప్రియ హత్యకేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఖిల్లా గణపురం మండలం మానాజిపల్లెలో ప్రియుడు శ్రీశైలం యువతిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 5న కళాశాలకు అని చెప్పి మైలార్‌దేవ్‌పల్లిలోని ఇంటి నుంచి బయలుదేరి సాయిప్రియ వనపర్తి జిల్లాలోని శ్రీశైలం వద్దకు వెళ్లింది. అమ్మాయి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండ్రోజులు దాటినా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో గతంలో పరిచయం ఉన్న శ్రీశైలంపై వారు అనుమానం వ్యక్తం చేశారు.
పోలీసులు శ్రీశైలంను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రులకు తెలియకుండా తన వద్దకు వచ్చిన సాయిప్రియను పెళ్లి చేసుకోవాలని శ్రీశైలం ఒత్తిడి చేశాడు. దానికి యువతి నిరాకరించడంతో అత్యాచారం చేసి మెడకు చున్నీ బిగించి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పూడ్చేందుకు బంధువు శివ సాయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు.