భార్యను తనకు కాకుండా చేస్తున్నారని, అందుకు పోలీసులే కారణమని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్ ఎదుటే బి.పృథ్వీరాజ్ అనే యువకుడు పెట్రోలు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని మహిళా పీఎస్ ఎదుట మంగళవారం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆతడిని ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అంతకముందు అతను విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
‘నా కుటుంబంలో చిన్న తగాదాలు జరిగి మహిళా పీఎస్‌కు వెళ్లాం. పోలీసులు కౌన్సెలింగ్ చేయకుండా నా భార్యను 60 రోజుల పాటు వేరేచోట ఉంచారు. అనంతరం రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్తే అక్కడి ఎస్‌ఐ నన్నుకొట్టి, నీకు నచ్చిన వాడితో వెళ్లిపో అంటూ నా భార్యకు సలహా ఇచ్చారు. నా భార్య నన్ను వదిలి వంద రోజులైంది. ఆమె లేకుండా నేను బతకలేను, అందుకే మరణిద్దామనుకుని నిర్ణయం తీసుకున్నాను. మహిళ పీఎస్ వద్ద 3 గంటలకు ఆత్మహత్య చేసుకుంటాను. నేను చనిపోవడానికి కారణం మహిళ పీఎస్, రెండో పట్టణ ఎస్‌ఐలే’ అని అందులో పేర్కొన్నారు. చెప్పినట్టే ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.