Chain snatching in Medak: మహిళ మెడలో నుంచి బంగారం దొంగతనం చేశాడనే అనుమానంతో పోలీసులు ఓ వ్యక్తిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఐదు రోజుల తరువాత అతడిని వదిలి పెట్టగా.. ఒళ్లు హూనం అయిన బాధితుడు మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. గురువారం బాధితుడు ఖాదిర్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణం అరబ్ గల్లిలో గత నెల 29న ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ చేశాడు. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
సీసీ పుటేజ్ ఆధారంగా హైదరాబాద్‌లో పని చేసే స్థానిక పిట్లంబేస్ వీధికి చెందిన మహహ్మద్ ఖదీర్‌ను అనుమానితునిగా గుర్తించారు. వెంటనే పోలీసులు హైదరాబాద్ వెళ్లి ఈ వ్యక్తిని పట్టుకుని వచ్చి.. ఎంక్వైరీ పేరుతో ఇష్టారీతిలో చిత్రహింసలు పెట్టి.. కొట్టారని బాధితుడు ఆరోపించాడు. ఈ నెల 2న పోలీసులు అతడిని వదిలిపెట్టగా ఇంటికి వెళ్లిన అతను 6న కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత బాధితుడిని కుటుంబసభ్యులు మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం కిడ్నీలు దెబ్బతినడంతో బాధితుడిని హైదరాబాద్ తరలించారు.