చేతబడి చేసి ఓ మహిళ మృతికి కారణమయ్యావని, జరిమానా విధిస్తామని కొందరు గ్రామస్థులు బెదిరించడంతో మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి ఉరేసుకుని బలవన్మరణం చెందారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ అమానవీయ ఘటన నల్గొండ జిల్లా దేవరకొండ మండలం వైదోనివంపు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. వైదోనివంపులో నెల రోజుల క్రితం ఓ మహిళ మృతిచెందింది. తేరటి అంజయ్య(54)తోపాటు మరో ఇద్దరు వ్యక్తులు చేసిన చేతబడే ఆమె మరణానికి కారణమని గ్రామస్థులు భావించారు. శుక్రవారం ముగ్గురినీ రచ్చబండ వద్దకు పిలవాలని గ్రామ పెద్దలు నిర్ణయించగా.. అంజయ్య అందుబాటులోకి రాలేదు. అక్కడికి వచ్చిన మిగతా ఇద్దరు వ్యక్తులను చితకబాది.. ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించారు.
చేతబడి నింద.. ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణం - ts news
మూఢనమ్మకాల పేరుతో క్రూరత్వాన్ని ప్రదర్శించారు ఓ గ్రామస్థులు. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో గ్రామస్థులు బెదిరించడంతో అవమానం భరించలేక ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన నల్గొండ జిల్లా వైదోనివంపు గ్రామంలో చోటుచేసుకుంది.
‘నువ్వు సైతం జరిమానా కట్టాల్సిందే’ అని హెచ్చరిస్తూ అంజయ్యకు గ్రామ పెద్దలు సమాచారం పంపారు. తనపై అకారణంగా నిందలు మోపారని, జరిమానా కట్టలేనని ఆందోళన చెంది తీవ్ర మనస్తాపానికి గురైన అంజయ్య.. అదే రోజు రాత్రి ఇంట్లో ఉరేసుకున్నారు. అయితే, ఈ విషయం బయటికి పొక్కకుండా శనివారం ఉదయమే ఆయన అంత్యక్రియలు పూర్తిచేశారు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం రాత్రి ఎస్సై గోపీకృష్ణ సిబ్బందితో కలిసి ఆ గ్రామానికి వెళ్లగా.. తమ కుటుంబానికి అన్యాయం జరిగిందంటూ బాధిత కుటుంబం బోరున విలపించింది. అంజయ్య మృతిపై విచారణ ప్రారంభించామని ఎస్సై చెప్పారు.
ఇవీ చదవండి: