Man Died by Pork Meat: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆంధ్రా వీధికి చెందిన యర్ర ఈశ్వరరావు చిరు వ్యాపారి. రోడ్డు పక్కన పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఉదయం పంది మాంసం కోసం దుకాణానికి వెళ్లిన ఈశ్వరరావు.. సరదాగా ఓ పచ్చి ముక్కను నోట్లో వేసుకున్నాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన అతని స్నేహితులు.. ఈశ్వరరావును ఆటపట్టించాలనుకున్నారు. ఒక్క ముక్క అలా తినటం గొప్పేమి కాదని.. పచ్చిది ఇంకోటి తినలేవని రెచ్చగొట్టారు. కావాలంటే ఇంకోటి తిని చూపించాలని అకతాయిగా పందెం కాశారు.
ఇంకేముంది.. వాళ్ల మాటలకు ఈశ్వరరావు పౌరుషానికి పోయాడు. తాను ఇంకో పచ్చి ముక్క తినగలనని నిరూపించుకోవాలని పందేనికి సై అన్నాడు. ఎలాగైనా పందెం గెలవాలనుకున్న ఈశ్వరరావు మరో ముక్కను నోట్లో వేసుకున్నాడు. మొదటిది సులువుగానే తిన్న ఈశ్వర్రావు.. రెండోది కూడా అలవోకగా తినగలనని ఊహించాడు. కానీ.. అదికాస్త గొంతుకు అడ్డం పడింది. ఈశ్వరరావుకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. కిందపడి గిలగిలా కొట్టుకున్నాడు.