నెలలు నిండిన భార్యకు అన్నీ.. తానై దగ్గరుండి చూసుకునేందుకు విధులకు సెలవు పెట్టాడు ఓ వ్యక్తి. వారం రోజుల క్రితమే అతడికి రెండో పాప పుట్టింది. పండంటి పసిపాపాయి పుట్టిన సంతోషం ఎంతోకాలం నిలవకముందే ఆ ఇంట్లో తీవ్ర విషాదం(TRAGEDY) అలుముకుంది. బిడ్డ పుట్టిన తర్వాత విధులకు వెళ్లిన తొలిరోజే అతడిని మృత్యువు కబళించింది(a man died in company). 26 రోజుల తర్వాత విధులకు హాజరవగా... యముడి రూపంలో ఉన్న యంత్రం బలిగొంది. ఈ హృదయ విదారక ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పరిధిలో జరిగింది.
నిలవని సంతోషం
మెదక్ జిల్లా గొల్లగూడెంకు చెందిన దుర్గాప్రసాద్ (35), రుక్మిణి దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చి డి.పోచంపల్లిలో నివాసముంటున్నారు. స్థానిక గండిమైసమ్మ చౌరస్తాలోని సాయిమోహిత ప్యాకింగ్ కంపెనీలో అతడు ఆపరేటర్‌గా పనిచేసేవాడు. నెలలు నిండిన భార్యకు అన్నీ తానై దగ్గరుండి చూసుకునేందుకు కంపెనీకి అతను సెలవు పెట్టాడు. వారం రోజుల క్రితమే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే కంపెనీకి సెలవు పెట్టిన 26 రోజుల తర్వాత మంగళవారం విధులకు హాజరయ్యాడు.
ప్రమాదం
కంపెనీలో విధులు నిర్వర్తిస్తుండగా ఊహించని రీతిలో మెషీన్‌కు ఉన్న బెల్టు తెగిపడటంతో... దానికి అనుసంధానమైన ఇనుప చక్రం పగిలి 8 ముక్కలైంది. అందులో ఒక ముక్క అతని తలకు బలంగా తాకింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇనుప ముక్క కార్మికుడు శివ తలకు తగలడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు కార్మికులు జావేద్, సంతోష్‌లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.