సూర్యాపేట జిల్లాలోని రాజానాయక్ తండాకు చెందిన భూక్య గోపి కుటుంబానికి ఇంటి దైవం ముత్యాలమ్మ. ఈనెల 12(మంగళవారం)న ముత్యాలమ్మకు కుటుంబమంతా కలిసి పండుగ చేశారు. అమ్మవారికి మేకను బలిచ్చి ఘనంగా వేడుక చేశారు. యాట మాంసాన్ని రుచికరంగా వండి.. అమ్మవారికి నైవేద్యంగా పెట్టారు. అనంతరం అందరూ సహ పంక్తిగా కూర్చొని సంతోషంగా భోజనాలు చేస్తున్నారు. మసాలాల ఘుమఘుమలతో జిహ్వ లాగేస్తున్న మటన్లో మంచిమంచి ముక్కలు తింటూ.. రుచిని ఆస్వాదిస్తున్నారు.
ఇంతలో.. భూక్య గోపి గొంతులో అనుకోకుండా మాంసం బొక్క ఇరుక్కుంది. అటు లోపలికి వెళ్లట్లేదు.. ఇటు బయటికి రావట్లేదు. ఊపిరి ఆడనివ్వట్లేదు. తెలిసిన అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఏదీ ఫలితమివ్వలేదు. ఉన్నాకొద్ది పరిస్థితి చేజారిపోతోంది. మనిషి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా వైద్యులు శాయశక్తులా ప్రయత్నించారు. అయినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతుండగానే గోపి ఊపిరి ఆగిపోయింది. చిన్న మాంసపు బొక్క ఓ మనిషిని ఉక్కిరిబిక్కిరి చేసి.. చివరికి ఆయువునే తీసేసింది. అంతవరకు ఎంతో సంతోషంగా పండుగ చేసుకున్న కుటుంబం.. గోపి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయింది.