"స్వాతి పిల్లలు జాగ్రత్త.. నాన్నా నువ్వు ధైర్యంగా ఉండు.. నేను ఎవరికీ రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు.. వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాను అంతే. ఇలా చేస్తానని అస్సలు ఊహించుకోలేదు. నాకు ఇద్దరు చిన్న పిల్లలు.. నా కుటుంబానికి కొంచెం ఆర్థికంగా అండగా ఉండండి.." క్రిప్టో కరెన్సీ యాప్లో పెట్టుబడి పెట్టి భారీ నష్టాలను చవిచూసిన ఓ వ్యక్తి.. చివరి రాత ఇది. వ్యాపార రంగంలో విశేష అనుభవం ఉండి.. సొంతంగా ఓ విద్యా సంస్థను నడుపుతూ సొసైటీలో మంచి హోదా, గుర్తింపు ఉన్న వ్యక్తి.. వ్యాపారం మిగిల్చిన నష్టంతో.. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
cryptocurrency: క్రిప్టోకరెన్సీ....ఖమ్మం జిల్లాకు చెందిన కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఉన్నత విద్యను అభ్యసించిన రామలింగస్వామి.. ఖమ్మంలో ఓ ప్రైవేటు విద్యాసంస్థను స్థాపించారు. కరోనా లాక్‌డౌన్ ప్రభావంతో పాఠశాలలు మూతపడి కొంత నష్టాలపాలయ్యారు. తెలిసిన వ్యక్తి ద్వారా క్రిప్టో కరెన్సీలో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టారు. స్నేహితులు, మరికొంతమంది తెలిసినవారితోనూ క్రిప్టోలో పెట్టుబడులు పెట్టించారు. అందరూ కలిపి మొత్తం దాదాపు కోటి 30 లక్షల వరకు పెట్టారు. ఇందులో రామలింగస్వామివి దాదాపు 70లక్షలు ఉన్నాయి.
తన వల్లే నష్టాలువచ్చాయంటూ..
క్రిప్టో కరెన్సీలో భారీ నష్టాలు రావడంతో... తీవ్ర నష్టాల పాలయ్యారు. ఆయనతో పాటు పెట్టుబడులు పెట్టినవారు... రామలింగస్వామి వల్లే ఇదంతా జరిగిందని నిందించారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలని ఒత్తిడి చేశారని... కారు, బంగారం లాక్కోవడమే కాకుండా ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకున్నారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. తీవ్ర అవమానంగా భావించిన రామలింగస్వామి.. మూడురోజుల క్రితం ఖమ్మం వచ్చి భార్యా పిల్లలను చూశారు. హైదరాబాద్లో పని ఉందని చెప్పి వెళ్లి ఈ నెల 22 సాయంత్రం సూర్యాపేటలోని ఓ లాడ్జిలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.
వేధింపులతో...
పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో స్వాతీ అంటూ...రామలింగస్వామి రాసిన లేఖ కుటుంబసభ్యుల్ని, బంధువుల్ని కంటతడి పెట్టించింది. ఎవరికీ డబ్బులు ఇచ్చేది లేకున్నా వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని భార్య కన్నీటి పర్యంతమవుతోంది.