కరోనాతో పెరిగిన ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తీర్చేందుకు పేద, మధ్యతరగతి కుటుంబాలు నానాపాట్లు పడుతున్నాయి. ఇదే అదనుగా పెద్దఎత్తున సొమ్ములు సంపాదించేందుకు ఒక మాయలేడి 15 మందితో ముఠా ఏర్పాటు చేసి పథకం వేసింది. కొంతకాలం మోసాలు సాఫీగా సాగినా చివరకు రాచకొండ పోలీసులకు చిక్కి ముఠా సభ్యులతో సహా కటకటాలపాలైంది.
అనుచరులకు డెమో తరగతులు :అగాపుర ప్రాంతానికి చెందిన చాంద్ సుల్తానా(55) సాధారణ గృహిణి. స్నేహితులు, బంధువుల నుంచి సొమ్ము తీసుకొని మరొకరికి అధిక వడ్డీలకు ఇస్తుండేది. అందులో నష్టాలు రావడం, అదనంగా తోడైన అనారోగ్య సమస్యలు, వైద్యఖర్చులు, రుణబాధల నుంచి బయటపడేందుకు పక్కా పథకం వేసింది. 15 మంది అనుచరులను రంగంలోకి దింపి సుల్తానా అతీంద్రియ శక్తులతో సొమ్ము నాలుగైదు రెట్లు అధికం చేస్తుందంటూ ప్రచారం చేయించింది. వీరిమాట నమ్మి వచ్చే బాధితులను.. చాలా తెలివిగా బురిడీ కొట్టించేవారు. అర్ధరాత్రి నిర్మానుష్య ప్రాంతంలోనే పూజలు చేయాలని, అక్కడైతే మాత్రమే కోరికలు సిద్ధిస్తాయంటూ బుట్టలో పడేసేవారు. ఈ విషయంలో అనుచరులకు డెమో తరగతులు కూడా ఆమె నిర్వహించేదని పోలీసులు తెలిపారు.
రూ.5 వేలు ఇస్తే యాభై వేలు చేస్తా :బాధితుడి నుంచి రూ.5000 తీసుకొని పూజలో ఉంచేవారు. ఆమె వచ్చి చేతి రుమాలు నుంచి రూ.50,000 తీసి పైకి విసిరేది. ఇంతలోనే అనుచరులు వచ్చి పోలీసులమంటూ హడావుడి చేసేవారు. బాధితులు సొమ్ము అక్కడే వదిలేసి పారిపోయేవారు. ఈ ముఠాపై మాదాపూర్, కుల్సుంపుర, నగర సీసీఎస్, రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇలాగే రూ.11లక్షలను రూ.5 కోట్లుగా మార్చుతుందని స్నేహితుడు మహేశ్ చెప్పడంతో హస్తినాపురం వాసి శ్రీనివాసరెడ్డి ఈ నెల ఒకటిన రాత్రి విశ్వేశ్వరయ్య కాలనీలో పూజకు ఏర్పాట్లు చేశారు. రూ.11లక్షలు నగదు పూజలో ఉంచారు. రాత్రి 11 గంటల తరువాత ఆమె అనుచరులు వచ్చి కర్రలతో దాడి చేసి పూజలో ఉంచిన రూ.11లక్షలు, చాంద్‌సుల్తానాను తీసుకుని వెళ్లిపోయారు.