తెలంగాణ

telangana

ETV Bharat / crime

murder: ఓ భర్త కిరాతకం.. సినీ ఫక్కీలో భార్యను కడతేర్చాడు - ap news

కడవరకు తోడుంటానని పెళ్లినాడు ప్రమాణం చేసిన వ్యక్తే కడతేర్చాడు.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యను ఎవరికీ అనుమానం రాకుండా వ్యాన్​తో ఢీకొట్టించి హత్య చేశాడు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా.. కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడిలో గురువారం సాయంత్రం జరిగింది. రోడ్డు ప్రమాదంగా భావించి కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టగా అసలు విషయం తెలిసింది.

wife murder
wife murder

By

Published : Aug 6, 2021, 2:03 PM IST

పెళ్లి సమయంలో తాళి కట్టి జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన ఆ భర్తే కాలయముడయ్యాడు.. విభేదాలను మనసులో ఉంచుకుని కట్టుకున్న భార్యనే కడతేర్చాడు.. సినిమాను తలపించేలా పక్కా ప్రణాళికతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఆమెను వ్యానుతో వచ్చి గుద్ది చంపేశాడు.. ఈ దారుణ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడి వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.

ఇదీ జరిగింది..

పోలీసుల వివరాల ప్రకారం వెంకటాపురం గ్రామానికి చెందిన పూతి రాధాకృష్ణ, సారవకోట మండలం అవలంగికి చెందిన లలిత (39)కు కొన్నేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. లలిత నిమ్మాడలోని చిన్న వెంకటాపురం అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేస్తున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా పిల్లలతో కలసి లలిత కోటబొమ్మాళిలో వేరుగా ఉంటున్నారు. అప్పటి నుంచి భర్త రాధాకృష్ణ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. లలిత ఎప్పట్లాగే గురువారం విధులకు హాజరయ్యారు. ప్రస్తుతం తల్లిపాల వారోత్సవాలు జరుగుతుండటంతో గ్రామంలో జరిగిన ర్యాలీ, అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అనంతరం చీకటి పడ్డాక ఇంటికి తిరిగొస్తున్న సమయంలో పెద్దబమ్మిడి కూడలి వద్ద వెనుక నుంచి వ్యాన్‌లో వచ్చిన భర్త రాధాకృష్ణ ఆమె ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. అప్పటివరకు తమతో పాటు కలిసి విధుల్లో పాల్గొన్న సహోద్యోగి కొద్ది నిమిషాల్లోనే మృత్యు ఒడికి చేరిందన్న వార్త తెలిసిన తోటి ఉద్యోగులంతా కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనపై ఎస్‌ఐ రవికుమార్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:Suicide: 'జీవితంపై విరక్తి కలిగింది'.. అన్నస్నేహితుడి ఫోన్​కు మెసేజ్.. ఆ తర్వాత!

ABOUT THE AUTHOR

...view details