మేడ్చల్ జిల్లా ముడి చింతలపల్లి మండలం జగ్గనగూడలోని అల్ఫామేడ్ ఫార్మా సొల్యుషన్స్ సంస్థలో అగ్ని ప్రమాదం(fire accident) చోటుచేసుకుంది. శనివారం రాత్రి పరిశ్రమలోని కింది అంతస్తులో మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. గమనించిన అక్కడ పనిచేస్తున్న సిబ్బంది బయటకు పరుగులు తీశారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పరిశ్రమ లోపలి నుంచి పేలుడు శబ్దాలు వినిపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. చూస్తుండగానే పరిశ్రమ అంతటా విస్తరించాయి.
ప్రమాదంలో ఔషధాలకు సంబంధించిన ముడి పదార్ధం మొత్తం అగ్నికి ఆహుతైంది. పరిశ్రమలోనే వేర్‌హౌస్ ఏర్పాటు చేసినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తించారు. ప్రమాద తీవ్రత పెరగడానికి ఇది కూడా కారణమని తెలుస్తోంది. ఈ పరిశ్రమలో అగ్నిమాపక ప్రమాణాలు లేనట్టు అధికారుల పరిశీలనలో బయటపడింది.