Girl Suspicious Death in Dammaiguda: మేడ్చల్ మాల్కాజ్‌గిరి జిల్లా దమ్మాయిగూడలో దారుణం జరిగింది. గురువారం పాఠశాలకు వెళ్లిన చిన్నారి.. శుక్రవారం ఉదయం స్థానిక అంబేడ్కర్ నగర్ చెరువులో శవమై తేలింది. స్థానికంగా నివాసం ఉండే.. నరేశ్‌కు ముగ్గురు పిల్లలు. వీరిలోచిన్న కుమార్తె పదేళ్ల ఇందు. పిల్లలందరూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. గురువారం ఉదయం నరేశ్, ఇందును.. పాఠశాల వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు.
తరగతి గదిలోకి వెళ్లిన ఇందు.. కొద్దిసేపటి తర్వాత దుకాణానికి వెళ్లి వస్తానంటూ తోటి విద్యార్థులకు చెప్పి.. బడిలోనే పుస్తకాల సంచి వదిలి వెళ్లిపోయింది. ఎంతకీ తిరిగి రాకపోయేసరికి ఉపాధ్యాయులు బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారు కుటుంబసభ్యుల ఇళ్లలో ఆరా తీశారు. ఆచూకీ తెలవకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. బాలిక ఆచూకీ కనుగొనడంలో పోలీసులు విఫలం అయ్యారంటూ.. కుటుంబసభ్యులు రోడ్డుపై బైఠాయించారు.
జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఉదయం అంబేద్కర్‌నగర్ చెరువులో ఇందు మృతదేహం తేలుతుండటం గుర్తించిన పోలీసులు.. మృతదేహాన్ని వెలికితీసి శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రి శవాగారానికి తరలించారు. ఉత్సాహంగా బడికి వెళ్లిన తమ బిడ్డ.. విగతజీవిగా చెరువులో శవమై తేలడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.