Gang Rape in Hyderabad: హైదరాబాద్ శివారు హయత్ నగర్ పరిధిలో బాలికపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపింది. తోటి విద్యార్థులతో పాటు మరో బాలుడు బాలికపై అత్యాచారం చేస్తూ వీడియోలను తీసి వాటిని చూపి బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను జువెనైల్ హోమ్‌కి తరలించారు. అత్యాచార వీడియోలు స్థానిక కౌన్సిలర్ దృష్టికి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా అమెతో పాటు అదే తరగతిలో మరో ముగ్గురు విద్యార్థులు చదువుతున్నారు.
చరవాణిలో ఎక్కువగా అశ్లీల వీడియోలు చూస్తున్న విద్యార్థులు బాలికపై కన్నేశారు. అమెతో ఉన్న చనువుతో విడతల వారీగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఆగస్టులో ఓ విద్యార్థి అత్యాచారం చేసి వీడియో రికార్డ్ చేశాడు. ఆ వీడియోను స్కూలుతో సంబంధం లేని, అదే కాలనీలో ఉండే మరో స్నేహితుడికి పంపాడు. అతడు కూడా ఆ వీడియోను బాలికకు చూపి అత్యాచారం చేశాడు. అతను కూడా చరవాణిలో వీడియో రికార్డు చేశాడు. ఈ వీడియోలను అతని స్నేహితులకు పంపించాడు. ఇలా 12 మందికి ఈ వీడియోలను పంపారు.