కనుపాపకు రక్షణ నిచ్చే రెప్పవోలే.. కలకాలం కష్టాన్ని దరిచేరనివ్వని రక్షకుడివోలే... కాచి కాపాడే రక్త సంబంధాన్ని.. అనురాగమనే ధారంతో ముడివేసి.. మమతానురాగాలను గుర్తుచేసే పండుగే రాఖీ (raksha bandhan). ఇంతటి ప్రధాన్యత ఉన్న ఈ రోజు ఓ సోదరి.. తన సోదరుడు రాఖీ కట్టించుకోలేదని మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడింది(girl suicide). అన్న చేతికి రాఖీ ముడి వేయలేకపోయాయని... మెడకు ఉరితాడు బిగించుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో జరిగింది.
జహీరాబాద్ పట్టణం మాణిక్ ప్రభు వీధికి చెందిన బొగ్గుల మమత(20)... తన అన్న రమేశ్‌కు రాఖీ కట్టేందుకు ఇంటికొచ్చింది. కానీ తన సోదరితో రాఖీ కట్టించుకోకుండా రమేశ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాఖీ కట్టడానికి ఎంతలా బతిమాలినా వినిపించుకోలేదు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన మమత.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
మృతురాలి పెద్ద అన్న ప్రేమవివాహం చేసుకున్నప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అన్న చెల్లి మధ్య మనస్పర్థలు రావడంతో రాఖీ కట్టించుకోలేదని.. మనస్తాపంతో మమత ఆత్మహత్య చేసుకుందని స్థానికులు అంటున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.