భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా 10వ వార్డులోని విశ్రాంత ఉపాధ్యాయుడు బావ నారాయణ ఇంట్లో 8 తులాల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని దుండగులు దొంగలించారు. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో ఏమి జరిగిందో తెలియక వృద్ధులైన ఉపాధ్యాయుడు అతని భార్య స్థానికులకు చెప్పేలోగా దొంగలు జారుకున్నారు. గత కొంతకాలంగా ఇలాంటి ఘటనలు పోలీసులకు సవాల్‌గా మారాయి.
తలుపులకు, కిటికీలకు రంధ్రాలు చేస్తూ చాకచక్యంగా ఇంట్లోకి ప్రవేశించి దొంగతనాలు చేస్తుండటంతో పట్టణ వాసులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. తాళాలు వేసి ఉన్న ఇల్లే కాకుండా.. మనుషులు ఉన్నప్పుడే చోరీలు జరుగుతుండటం మరింత భయం కలిగిస్తోంది.
కిటికీలకు రంధ్రాలు చేసి ఇంట్లోకి ప్రవేశించి దొంగలు ఏటీఎం కార్డు మార్పుతో మరో చోరీ..
ఏటీఎం కార్డు మార్పుతో విశ్రాంత సింగరేణి కార్మికుడు మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 11న దర్శనాల యాదగిరి ఇల్లందులోని ఓ ఏటీఎం కేంద్రానికి డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లాడు. అంకెలు సరిగ్గా కనపడటం లేదని అపరిచిత వ్యక్తికి కార్డు ఇవ్వటంతో... మాటల్లో పెట్టి కార్డు మార్చి ఇచ్చాడు. దీనిని ఆలస్యంగా గుర్తించిన విశ్రాంత కార్మికుడు బ్యాంకును సంప్రదించగా అప్పటికే ఖాతా నుంచి రూ. 47 వేలు తీసుకున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేరస్థుడుని గుర్తించే పనిలో ఉన్నారు.
ఇదీ చదవండి:ఎన్నికల కోడ్‌కు ముందే ఆ సీఎంల వరాల జల్లు!