తెలంగాణ

telangana

HRC: 'పోలీసులు రోజూ వేధిస్తున్నారు.. మమ్మల్ని కాపాడండి'

By

Published : Aug 10, 2021, 4:19 PM IST

జగద్గిరిగుట్ట పోలీసులు తమను రోజూ వేధిస్తున్నారని ఓ కుటుంబం హెచ్చార్సీని(HRC) ఆశ్రయించింది. సివిల్ కేసులో జోక్యం చేసుకుంటూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్చలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.

complaint to hrc, a family complaint on police
హెచ్చార్సీని ఆశ్రయించిన బాధితులు, పోలీసులపై ఫిర్యాదు

సివిల్ కేసులో జోక్యం చేసుకుంటూ తీవ్ర వేధింపులకు గురిచేస్తున్న జగద్గిరిగుట్ట పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఓ కుటుంబం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను(HRC) ఆశ్రయించింది. హైదరాబాద్ అంబర్‌పేటలో నివాసముంటున్న తమని పోలీసులు రోజూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమ పెద్ద కుమారుడు కోయిల్ బాలచందర్ జగద్గిరిగుట్టలో ఓ ఇంటిని నిర్మిస్తున్నారని బాధితులు తెలిపారు. ఇంటిని పూర్తిగా నిర్మించి ఇచ్చినందుకు మనోహర్ అనే వ్యక్తికి ఒప్పందం ప్రకారం డబ్బులు ఇచ్చారని తెలిపారు. కానీ మనోహర్ రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వాపోయారు.

పోలీసులు ఉదయాన్నే తమ ఇంటికి వచ్చి... తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదన్నారు. సివిల్ కేసులో పోలీసులు జోక్యం చేసుకోరాదని కోర్టులు చెబుతున్నప్పటికీ... ఈ విధంగా వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ కుమారుడు ఇంటికి రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న జగద్గిరిగుట్ట పోలీసులపై చర్యలు తీసుకొని... తమ కుమారుడి ఆచూకీ తెలపాలంటూ ఆ తల్లిదండ్రులు హెచ్చార్సీని వేడుకున్నారు. దీనిపై స్పందించిన హెచ్చార్సీ... నవంబర్ 10లోగా ఈ సంఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జగద్గిరిగుట్ట ఏసీపీని ఆదేశించింది.

పోలీసులు రోజు ఉదయమే మా ఇంటికి వస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మా పెద్ద కొడుకు లేకున్నా మమ్మల్ని బెదిరిస్తున్నారు. డబ్బులు కట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మా చిన్న కొడుకులను తీసుకుపోతామని బెదిరిస్తున్నారు. అంబర్‌పేట పోలీసులను కలవకుండానే మమ్మల్ని తీసుకుపోతామని అంటున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి.

-బాధితులు

పోలీసులపై హెచ్చార్సీకి ఫిర్యాదు

సివిల్ కేసులో పోలీసులు జోక్యం చేసుకోవద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పోలీసుల ద్వారా ఓ వ్యక్తి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఏం క్రైం జరగలేదు. అయినా పోలీసులు వారిని ఇబ్బంది పెడుతున్నారు. అందుకే బాధితులు హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు.

-బాధితుల తరపు న్యాయవాది

ఇదీ చదవండి:'హైకోర్టుల అనుమతి ఉంటేనే నేతలపై​ కేసులు వాపస్'

ABOUT THE AUTHOR

...view details