అత్తమామలు ఆస్తి పంచడంలేదని సొంత ఇంటికే కన్నం వేసింది ఓ కోడలు. సాంకేతికత వాడుకొని సులభంగా పని పూర్తి చేసింది. పోలీసులకు ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. కరీంనగర్‌లో నివాసముంటున్న వైకుంఠానికి నలుగురు కుమారులున్నారు. తనవద్ద ఇద్దరు కుమారులు, కోడళ్లు ఉండగా ... మరో ఇద్దరు కుమారులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. కరీంనగర్‌లో ఉమ్మడి కుటుంబంలో ఉండలేమని కోడలు కొద్దినెలలుగా తరచూ అత్తమామలతో గొడవపడుతుండేది. తమ తదనంతరం ఆస్తిపంచుకోవాలని అత్తమామలు తెగేసి చెప్పడంతో అసంతృప్తితో సంసార బాధ్యతలు నిర్వహిస్తోంది. సూటిపోటి మాటలతో వృద్ధులను వేధిస్తుండేది.
పక్కా స్కెచ్ వేసి..
అత్తమామల వద్ద ఉన్న ఆభరణాలు కాజేయాలని పథకం వేసింది. 3నెలల క్రితం మామ ఫోన్‌లో ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసి... తన గూగుల్ డ్రైవ్‌కు అనుసంధానం చేసింది. అప్పటి నుంచి ఫోన్‌లో మాట్లాడిన మాటలన్నీ వినడం ప్రారంభించింది. దసరాకు కొడుకు పిలిచాడని బేగంపేటలో ఉన్న కొడుకు రావాలని కోరడంతో వృద్ధ దంపతులు హైదరాబాద్ వచ్చారు. వచ్చేటప్పుడు బీరువా, అల్మారా, దేవుడి గది తాళాలు తీసుకురావద్దని, ఇంట్లోనే భద్రపరిచి రావాలంటూ కుమారుడు చెప్పాడు. దీంతో వైకుంఠం తాళాలను ఎక్కడా ఉంచింది కొడుకుకు వివరంగా చెప్పాడు.