కొవిడ్ మహమ్మారితో దంపతులు మృతి చెందారు. రోజుల తేడాలో తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. గూడూరు మండలం దామరంచ గ్రామానికి చెందిన బంగారి దేవేందర్, సుమలత దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు. మహబూబాబాద్ పట్టణంలోని మిల్ట్రీ కాలనీలో నివాసం ఉంటూ, భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు.
రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు - కొవిడ్‌తో దంపతులు మృతి
ఇన్నాళ్లు సంతోషంగా గడిపిన వారి కుటుంబంలో కొవిడ్ మహమ్మారి తీవ్ర విషాదం నింపింది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో చదువుకుంటున్న వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. రోజుల తేడాలో తల్లిదండ్రులను పొట్టన పెట్టుకుని అనాథలను చేసింది.
ఇటీవల భార్య భర్తలతో పాటు పిల్లలకు కొవిడ్ సోకింది. దంపతులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా... మే31న సుమలత (37) మృతి చెందింది. రెండు రోజుల వ్యవధిలోనే దేవేందర్ (42)ను కొవిడ్ పొట్టనపెట్టుకుంది. దంపతుల మృతితో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. వీరి పెద్ద కుమార్తె ప్రియ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుండగా... రెండో కుమార్తె ఇంటర్ ప్రథమ సంవత్సరం, కుమారుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు కోల్పోయి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన ముగ్గురు పిల్లలను దాతలెవరైనా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి:విద్యుదాఘాతంతో యువకుడు మృతి