A Couple SUICIDE ATTEMPT: ఆ దంపతులు తమ భూమిని.. వేరే వ్యక్తులు వారి పేరు మీద పట్టా చేయించుకున్నారని అధికారుల చుట్టూ తిరిగారు. అయినా వారికి న్యాయం జరగలేదు. చివరికి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు వారికి ఎలాంటి న్యాయం జరగలేదు. దీంతో విసిగివేసారిన ఆ బాధిత దంపతులు కలెక్టరేట్లోనే ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. ఈఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన నర్సింగరావుకు నాలుగు ఎకరాల భూమి ఉంది. కానీ వేరే వ్యక్తులకు ఎలాంటి పత్రాలు లేకుండా సంబంధిత భూమిని అధికారులు పట్టా చేశారు. దీనిపై బాధితుడు నర్సింగరావు తన భూమిని అక్రమంగా వేరే వారికి పట్టా చేశారని అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై బాధితుడు అయిదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అయినా అతనికి న్యాయం జరగలేదు. చివరికి కలెక్టర్‌కి తన మొర విన్నవించాడు.
ఆయన సమస్య పరిష్కారిస్తానని హమీ ఇచ్చారు. అప్పటి నుంచి సమస్య పరిష్కారం కాకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. చివరకు ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయం పైకి ఎక్కి డీజిల్ పోసుకొని భార్యాభర్తలు నర్సింగరావు, రేవతిలు ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు వారిపై నీరు చల్లి వారిని కిందికి దించారు. కలెక్టర్ హామీ ఇచ్చిన ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్యకు యత్నించినట్లు వారు తెలిపారు. గతంలో ఇదే భూ సమస్య పరిష్కారం రెండు సార్లు నర్సింగరావు ఆత్మహత్యకు యత్నించడం గమనార్హం.