రూ.6 కోట్లకుపైనున్న భూ వ్యవహారంలో తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసిన ఘటనలో ఓ నిర్మాణ సంస్థ ప్రతినిధిపై షేక్‌పేట తహసీల్దార్ బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నంబరు 10లోని సర్వే నంబరు 129(పాతది)లో దాదాపు 600ల గజాల స్థలం ఉంది. ఇది ప్రభుత్వ స్థలంగా గుర్తించిన రెవెన్యూ వర్గాలు గతంలోనే స్థల స్వాధీనానికి వెళ్లగా దీనిపై సోమాజిగూడకు చెందిన సేఫ్‌వే బిల్డర్స్ ప్రతినిధి అసదుల్లా పాషా కోర్టులో ఆ స్థలం తనదేనంటూ పిటీషన్ దాఖలు చేశారు.
ఇందుకు సంబంధించి తనకు నో అబ్జక్షన్ సర్టిఫికేట్(ఎన్‌ఓసీ) సైతం వచ్చిందని కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ఈ నేపథ్యంలోనే షేక్‌పేట రెవెన్యూ అధికారులు కోర్టుకు సమర్పించిన ఎన్‌ఓసీని పరిశీలించారు. ఇందులో భాగంగా 2019లో అప్పుడు షేక్‌పేట తహసీల్దార్‌గా పనిచేసిన వెంకటరెడ్డి సంతకాన్ని అసదుల్లా పాషా ఫోర్జరీ చేసి ఎన్‌ఓసీ సమర్పించినట్లు గుర్తించారు.