Attack: సైడ్ ఇవ్వలేదంటూ ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పైనే దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. కారుకు సైడ్ ఇవ్వలేదని యజమాని ఆగ్రహంతో బస్సు డ్రైవర్‌ను చితకబాదాడు. ఈ దాడిలో డ్రైవర్ అనిల్, కండక్టర్ పల్లె కృష్ణమూర్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ వంతెనపై జరిగింది. ఈ విషయాన్ని డ్రైవర్ వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సనత్‌నగర్ పోలీసులు కారు యజమాని నిజాంపేటకు చెందిన బుడ్డాపాటి జయంత్‌గా పోలీసులు గుర్తించారు.
సంగారెడ్డి బస్సు డిపోకు చెందిన బస్సు (ఏపీ 23 జెడ్ 0054) బీదర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన జరిగింది. నగరంలోని ఎర్రగడ్డ బ్రిడ్జిపై వెళ్తున్న సమయంలో బస్సు డ్రైవర్ సైడ్ ఇవ్వనందుకు కారును అడ్డంగా పెట్టిన యజమాని జయంత్ డ్రైవర్‌పై దాడి చేశాడు. అడ్డుకునేందుకు యత్నించిన కండక్టర్‌పై కూడా దాడికి పాల్పడ్డాడు. కారు యజమాని జయంత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.