Slab of Building Under Construction Collapsed: హైదరాబాద్ కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం శ్లాబులు కూలి... ఇద్దరు కూలీలు మృతి చెందారు. కూకట్‌పల్లికి చెందిన లక్ష్మణ్‌రావు... 200 గజాల స్థలంలో.. స్టిల్ట్ ప్లస్ ఫోర్ భవనం నిర్మిస్తున్నారు. వాస్తవానికి స్టిల్ట్ ప్లస్ టూకే అనుమతి ఉంది. శనివారం చివరి అంతస్తు శ్లాబు పనులను సెవెన్‌హిల్స్ అనే రెడీమిక్స్ సంస్థ చేపట్టింది. పనులు పూర్తయ్యాక సరంజామా తీసుకోవడానికి ఆనంద్, దయాశంకర్ భవనంపైకి వెళ్లారు. ఆ సమయంలో భారీ శబ్దంతో.. అపుడే వేసిన శ్లాబు సగం కూలి.. మూడో అంతస్తుపై పడింది. శిథిలాల కింద చిక్కుకున్న ఆనంద్, దయాశంకర్ విగతజీవులుగా మారారు.
కూకట్‌పల్లిలో కూలిన భవనం స్లాబ్... ఇద్దరు కార్మికులు మృతి
16:02 January 07
కూకట్‌పల్లిలో కూలిన భవనం స్లాబ్... ఇద్దరు కార్మికులు మృతి
ఈ ఘటనలో పిల్లర్లు, బీములు... ఎదురు బొంగుల్లా ఎక్కడికక్కడే విరిగిపోయాయి. శిథిలాలను తొలగించి... మృతదేహాలు వెలికితీయడానికి డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, అగ్నిమాపక శాఖ యంత్రాంగాలు ఐదు గంటలు శ్రమించాయి. కట్టర్ల సాయంతో శకలాలు తొలగించి రాత్రి పొద్దుపోయాక ఇద్దరి మృతదేహాలు బయటికితీశారు. శ్లాబు వేస్తే కనీసం రెండు వారాలు ఆగి.. పైఅంతస్తు నిర్మాణం చేపట్టాలి. కూలీలు వద్దని వారించినా.. యజమాని వారి మాట పెడచెవిన పెట్టి ఐదురోజుల్లోనే రెండు అంతస్తులు నిర్మించేందుకు యత్నించాడు. అందువల్లే శ్లాబు కూలి ఇద్దరు కూలీలు మృత్యువాత పడ్డారు.
భవన యజమాని నిబంధనలు ఉల్లంఘించి... అదనపు అంతస్తులు నిర్మిస్తున్న విషయాన్ని జనవరి 3న గుర్తించామని... జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అదనంగా చేపట్టిన నాలుగు, ఐదు అంతస్తు శ్లాబుల పిల్లర్లను ఎందుకు కూల్చకూడదో చెప్పాలని నోటీసు ఇచ్చామని వెల్లడించారు. యజమాని తమ హెచ్చరికలు పట్టించుకోకుండా... పనులు చేశారని వివరించారు. ప్రమాదస్థలిని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవం కృష్ణారావు సందర్శించారు. భవనానికి రెండు అంతస్తులకు మించి నిర్మించడానికి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు.
భవనం పైకప్పులు కూలిన సమయంలో భారీ శబ్దాలు రావడంతో... ఏం జరిగిందో తెలియక స్థానికులు ఆందోళనతో పరుగులు తీశారు. భవన యజమానిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మృతి చెందిన రెడీమిక్స్ కార్మికులకు న్యాయం చేయాలని... వారి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలను కూల్చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: