Uppal Father and Son Murder Case Update: హైదరాబాద్ ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధి హనుమాన్ నగర్‌లో శుక్రవారం జరిగిన పూజారి నరసింహశర్మ, ఆయన కుమారుడు శ్రీనివాస్ హత్య కేసు ఛేదించేందుకు రాచకొండ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం తెల్లవారుజామున మారణాయుధాలతో దాడి చేసి తండ్రీకుమారులను హత్య చేశారు. కుటుంబ ఆస్తి గొడవలే కారణమని మృతుడు నరసింహ శర్మ పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు పోలీసులకు చెప్పడంతో నరసింహ శర్మ సోదరుడు, సోదరిని, వారి కుమారులను ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.
అయితే విచారణలో వీళ్లకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడైనట్లు సమాచారం. సోదరి, సోదరులను విడిచిపెట్టిన పోలీసులు.. వారి ఇద్దరు కుమారులను మాత్రం లోతుగా విచారిస్తున్నారు. హత్యకు గురైన స్థలంలో సీసీ కెమెరాలు ఉన్నా.. అవి 5 రోజులుగా పని చేయడం లేదు. దీంతో దర్యాప్తునకు ఆటంకం ఏర్పడింది. సమీపంలో ఉన్న వేరే సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అలాగే దగ్గరలోని ప్రైవేటు వసతి గృహంలో ఉన్న వారినీ ప్రశ్నిస్తున్నారు. హంతకులకు 30 నుంచి 35 ఏళ్ల వయసు ఉంటుందని.. టీ షర్ట్, ముఖానికి మాస్కులు ధరించి ఉన్నారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ దిశగా ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.