తెలంగాణ

telangana

ETV Bharat / crime

Suicide: 98 ఏళ్ల వృద్ధురాలు ఆత్మహత్య... అంత కఠిన నిర్ణయం ఎందుకంటే.. - తెలంగాణ వార్తలు

ఆమె వయసు 98 ఏళ్లు. జీవితంలో ఎన్నో చూసింది. ఒడుదొడుకులను తట్టుకుని జీవితాన్ని ముందుకు సాగించింది. కానీ అయినా వాళ్లే తన కళ్ల ముందు ప్రాణాలు వదిలేస్తుంటే ఆత్మనిబ్బంరం కోల్పోయింది. కట్టుకున్నవాడు చనిపోయినా సరే కడుపున పుట్టినవారి కోసమే బతికింది. కానీ ఆ పిల్లలే ఒకరి తర్వాత ఒకరు దూరమవుతుంటే.. బతకాలన్న ఆశను కోల్పోయి.. ఆత్మహత్యే శరణ్యం అనుకుంది.

Suicide
వృద్ధురాలి ఆత్మహత్య

By

Published : Nov 2, 2021, 8:10 AM IST

ఓ వృద్ధురాలు 98 ఏళ్ల వయసులో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కట్టుకున్న తోడు, కన్న బిడ్డలు కళ్లముందే ఒక్కొక్కరుగా మరణించడాన్ని తట్టుకోలేక తనువు చాలించారు. ఎస్సార్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుందీ విషాద ఘటన. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నానికి చెందిన కమలమ్మ(98) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. వీరు ఎస్సార్‌నగర్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో ఉంటున్నారు.

కమలమ్మ భర్త 1981లో కన్నుమూశాడు. తరువాత కొద్దిరోజులకే పెద్ద కుమార్తె పద్మావతి అనారోగ్యంతో మరణించారు. 2020 ఆగస్టులో కుమారుడు రాఘవేందర్‌రావు, కోడలు కరోనాతో మృత్యువాతపడటంతో ఆమె మనోవేదనకు గురయ్యారు. అప్పట్నుంచి మనవడు(రాఘవేందర్‌రావు కుమారుడు) డాక్టర్‌ కమల్‌ రామ్‌జీ ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. చిన్న కుమార్తె జోహర్మతి 9 నెలల కిందట డెంగీతో మరణించడంతో ఆమె మరింత కుంగిపోయారు. గతంలో తానుంటున్న అపార్టుమెంటు పైనుంచి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. అపార్ట్‌మెంట్‌ వాసులు సకాలంలో గుర్తించి, ఆమెను రక్షించారు. అప్పట్నుంచి మనవడు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. శనివారం కమల్‌ రామ్‌జీ, ఆయన భార్య విధి నిర్వహణ నిమిత్తం బయటకు వెళ్లారు. సాయంత్రం వచ్చేసరికి తలుపు మూసి ఉండటంతో ఆందోళనకు గురయ్యారు. మారుతాళంతో తలుపు తెరిచారు. కమలమ్మ సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్టు గుర్తించి హతాశులయ్యారు. వారి ఫిర్యాదుతో ఎస్సార్‌నగర్‌ పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపారు.

ఇదీ చూడండి:Lovers suicide: పెద్దోళ్లు ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details