8th class boy died: ద్విచక్రవాహనం నడపాలన్న ఉత్సుకత ఏవైపు.. మాకూ నడపొచ్చిందన్న అత్యుత్సాహం మరోవైపు.. తల్లిదండ్రులు ఏ చిన్న పని చెప్పినా పిల్లలు(మైనర్లు) బండి మీదే వెళ్తున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా కొన్నిసార్లు వెళ్తుంటే.. మారం చేసి మరీ ఇంకొన్ని సార్లు బైకులు తీసుకెళ్తున్నారు. "దగ్గరే కదా.. ఏముందిలే.. వాడికి కూడా అలవాటవుతుంది.." అని తల్లిదండ్రులు కూడా చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. మొత్తంగా మైనర్లు బండ్లపై రోడ్డెక్కి.. ప్రమాదాలకు గురవుతున్నారు. తల్లిదండ్రుల ఏమరపాటు.. పిల్లల్ల తొందరపాటు.. మొత్తంగా ఇద్దరి పొరపాటు ఫలితం ఓ నిండు ప్రాణం.
హైదరాబాద్ మైలార్దేవ్పల్లిలో ద్విచక్రవాహనాన్ని నడుపుతూ ప్రమాదానికి గురై ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడు మృతి చెందాడు. ప్రకాశం జిల్లాకు చెందిన రమణయ్య.. కుటుంబంతో సహా మైలార్దేవ్పల్లిలో నివసిస్తున్నాడు. మేస్త్రీ పని చేసుకునే రమణయ్య దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు మణిదీప్(14 ఏళ్లు).. బుద్వేలులో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. క్యాన్సర్ బారిన పడిన రమణయ్య గత కొంత కాలంగా మంచానికే పరిమితమయ్యాడు.