Fingerprint Surgery gand arrest: చేతిపై వేలిముద్రలు మార్చి.. విదేశాల్లో ఉద్యోగాలకు పంపేందుకు ప్రయత్నిస్తున్న గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే తాగా ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేసినట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. శస్త్రచికిత్స చేసిన ఫింగర్ ప్రింట్ ఏడాది పాటు ఉంటుందని... ఆసమయంలోనే గుర్తింపు మార్చి విదేశాలకు వెళ్లేందుకు కుట్ర పన్నారని మహేశ్ భగవత్ వివరించారు. రాజస్థాన్, కేరళ వెళ్లిన పోలీసు బృందాలు కేసులో పురోగతి సాధించాయి. రాజస్థాన్‌లో కమలేష్, విశాల్, కేరళ నుంచి బషీర్ అబ్దుల్, మహమ్మద్ రఫీలను అరెస్ట్ చేశామని తెలిపారు.
శస్త్రచికిత్స చేసిన ఫింగర్ ప్రింట్ ఏడాది పాటు ఉంటుంది. నకిలీ ఫింగర్ ప్రింట్ ద్వారా విదేశాలకు వెళ్లేందుకు ఇలా కుట్ర పన్నారు. ఇప్పటివరకు 8మందిని అరెస్టు చేశాం. కువైట్‌లోని భారత ఎంబసీకి సమాచారమిస్తాం. మరికొంత మందిని అరెస్ట్ చేస్తాం. వేళ్లకు సర్జరీ చేసి కొత్త గుర్తింపుతో మళ్లీ కువైట్‌కు వెళ్లారు. అలా వెళ్లిన వారిని స్వదేశానికి రప్పిస్తాం. - మహేశ్ భగవత్, రాచకొండ సీపీ
అసలు ఏంటీ కథ: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ కడప జిల్లా సిద్ధవటం మండలం, జ్యోతి గ్రామానికి చెందిన గజ్జలకొండుగారి నాగమునీశ్వర్‌రెడ్డి(36) తిరుపతిలోని కృష్ణా డయాగ్నస్టిక్స్‌లో రేడియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని స్నేహితుడు బాలాజీ తిరుపతి జిల్లా తానపల్లి గ్రామానికి చెందిన సాగబాల వెంకటరమణ(39) అనస్తీషియా టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. నాగమునీశ్వర్‌రెడ్డి ఒకసారి కడపకు వెళ్లినప్పుడు కువైట్‌కు వర్క్ పర్మిట్ మీద వెళ్లి కొన్ని రోజుల క్రితం తిరిగొచ్చిన వ్యక్తిని కలిశాడు. మళ్లీ కువైట్ వెళ్లేందుకు యత్నించగా అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు చేతి వేలిముద్రల ఆధారంగా వివరాలు తెలుసుకుని గతంలో అక్రమంగా ఉన్నట్లు గుర్తించి వెనక్కి పంపినట్లు వివరించాడు. ఈ నేపథ్యంలో శ్రీలంకకు వెళ్లి శస్త్రచికిత్స ద్వారా వేలిముద్రల్ని మార్చుకున్నట్లు చెప్పాడు. దీని గురించి వివరంగా తెలుసుకున్న నాగమునీశ్వర్‌రెడ్డి అక్రమంగా డబ్బు సంపాదించేందుకు వేలిముద్రలు మార్చే శస్త్రచికిత్సలు చేపట్టాలని వ్యూహం పన్నాడు. ఇందుకు అతని స్నేహితుడు వెంకటరమణ అంగీకరించాడు.